పబ్బం హరిలా మారిన సబ్బం హరి…!

  • Published - 07:42 AM, Tue - 21 April 20
పబ్బం హరిలా మారిన సబ్బం హరి…!

జోస్యాలు చెప్పడం…ప్రజలు గుర్తించలేని అంశాలు…ప్రమాదకర పరిణామాలు అంటూ కొన్ని ఎంపిక చేసుకున్న ప్రసార, పత్రికా మాధ్యమాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం…ఇది అతి తక్కువ మంది రాజకీయ నాయకులు చేసే పని. ఈ కళలో సిద్ధహస్తులు మాజీ ఎంపీ సబ్బం హరి. తాజాగా ఓ ప్రసార మాధ్యమం సౌజన్యంతో ఆయన చేసిన విమర్శలు…తన రాజకీయ పబ్బానికే తప్ప ప్రజలకు మీసమెత్తు ఉపయోగం కూడా కల్పించేవిగా లేవని చెప్పొచ్చు.

కరోనా..ఐతే నాకేం…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఉద్యమంలా విమర్శలు చేసేవారిలో సబ్బం హరి ముందు వరుసలో ఉంటారు. నిన్నటి ఆయన టీవీ రాజకీయం చూశాక.. కరోనా వల్ల రాష్రంతోపాటు యావత్ ప్రపంచం తల్లడిల్లుతున్న సమయంలోనూ జగన్ పై విమర్శలు చేసే అలవాటును సబ్బం హరి వదులుకోలేకపోతున్నారా అనే సందేహం వస్తోంది.

ఆదరిస్తే ఇదా బహుమానం….

రాజకీయాల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సబ్బం హరిని వైఎస్ కుటుంబం బాగా ఆదరించింది. వైఎస్ రాజశేరరెడ్డి సహకారంతో పలు కీలక పదవులు సబ్బం హరిని వరించాయి. తదనంతర కాలంలో వైఎస్ జగన్ సైతం ఎంతో ఆదరించారు. పార్టీకి సంబంధించిన పలు కీలక విషయాలను సబ్బంతో పంచుకున్నారు. కానీ, ఆయన సదరు విషయాలను తెలుగుదేశం అనుకూల మీడియాకు చేరవేసే వాడని… అది తెలిసి జగన్ దూరం పెట్టారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి.

సబ్బం హరి…వైఎస్ జగన్ దగ్గరే కాదు…నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వద్దా తనదైన రాజాకీయం ప్రదర్శించారు. 2014లో సమైక్యాంధ్ర పార్టీ నుంచి వైజాగ్ నుంచి బరిలోకి దిగిన ఆయన పోలింగ్ కు కొన్ని గంటల ముందు బీజేపీకి ఓటెయ్యాల్సిందిగా పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ప్రోత్సహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి అయిన విజయమ్మను ఓడించాలని శతవిధాలా కృషి చేశారు. దీన్ని బట్టే రాజకీయాల్లో సబ్బం హరి నిబద్ధత ఏంటో తేటతెల్లమవుతోంది.

అందుకేగా సాగనంపింది….

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించినందుకు ప్రజలు తెగ చింతిస్తున్నారు…జమిలి ఎన్నికలొస్తేనే ప్రజల బాధలు తీరుతాయి అంటూ సబ్బం తన అక్కసును వెళ్లగక్కారు. దీనిపై అలా చింతించేగా చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారూ.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఐనా ఎన్నికల్లో ప్రజలు గోరంగా తిప్పికొట్టి ఏడాది గడవకుండానే మళ్ళీ ఎన్నికలంటూ కలవరించటం చూస్తుంటే…వైకాపా అధికారంలో ఉండటాన్ని అస్సలు సహించలేకపోతున్నారనే విషయం స్పష్టమవుతోంది.

ఎందుకింత అక్కసు…

ఏపీని మొన్నగాక మొన్న ఉగాండాతో పోల్చిన ఘనుడు… సబ్బం హరి. రాష్రంలో రౌడీ రాజ్యం…లా అండ్ ఆర్డర్ లేదంటూ విమర్శించే ఈయనకు తెలుగుదేశం హయాంలో పత్తికొండ వైసీపీ ఇంఛార్చ్ చెరుకులపాటి నారాయణ రెడ్డిని పట్టపగలు టీడీపీ మనుషులు హత్య చేసినపప్పుడు…తాసీల్ధార్ వనజాక్షిని ప్రభుత్వ విప్ కొట్టినప్పుడు నోరు పెగలకపోవడం నిజంగా శోచనీయం…! కానీ ఇప్పుడు వైఎస్ జగన్ పై వ్యక్తిగత కక్షతో రాష్రంపై ఈ రకంగా దుష్ప్రచారం చేయడం అత్యంత గర్హనీయం.

Show comments