Idream media
Idream media
సినీ కళాకారులకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. సినీ అభిమానులకు అయితే కొదవేలేదు. అందుకే ఏపీలో అత్యధిక థియేటర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అందరికీ అనువుగా ఉండేలా జగన్ సర్కారు టికెట్ల ధరలపై సమీక్ష జరుపుతోంది. ఇప్పటికే ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. దాని వల్ల పరిశ్రమకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని కొందరు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే నిర్ణయాన్ని సర్కారు దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ధరలను పునఃసమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది. సినీ ప్రముఖులు జగన్ తో కూడా భేటీ అయ్యారు. మొత్తంగా వివాదాన్ని కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు కూడా కమిటీ భేటీ అయింది.
సచివాలయంలో జరిగిన ఈ భేటీలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్ సహా పదమూడు మంది సభ్యులతో కూడా కమిటీ పాల్గొంది. కొద్ది రోజుల్లోనే టికెట్ల ధరల అంశానికి ముగింపు పలకనున్నట్లు కమిటీ సభ్యుడు ముత్యాల రాందాస్ తెలిపారు. వారంరోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలుగు ఫిలించాంబర్స్ ఆఫ్ కామర్స్ సభ్యులు. గతంలో పెట్టిన ప్రతిపాదనల్నే.. కమిటీ ముందు ఉంచామనీ… అన్నీ చర్చించి కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సినిమా పెద్దలు, సీఎం భేటీ సందర్భంగా మాట్లాడిన విషయాలు కూడా ఇవాళ భేటీలో చర్చకు వచ్చినట్టు… చాంబర్ సభ్యులు తెలిపారు. అటు ఆడియన్స్, ఇటు ఇండస్ట్రీకి మంచి జరిగేలా అతి త్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత… అధ్యయనం చేసి టికెట్ ధరలపై జగన్ సర్కార్ జీవో రూపంలో నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. టికెట్ల ధరల అంశం కొలిక్కిరావడంతో పాటు, ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కూడా సర్కారు కృషి చేస్తుండడం సంతోషించదగ్గ విషయమని సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఇండస్ట్రీ తరపున కూడా ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని చెబుతున్నారు. తాజాగా సినీ హీరో మంచు విష్ణు కూడా తిరుపతిలో స్టూడియో నిర్మించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు విశాఖలో కూడా స్టూడియోల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి.