iDreamPost
android-app
ios-app

Ysr kanti velugu – విద్యార్థుల చూపునకు భరోసాగా ‘వైఎస్సార్ కంటి వెలుగు’

  • Published Nov 20, 2021 | 8:28 AM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Ysr kanti velugu – విద్యార్థుల చూపునకు  భరోసాగా ‘వైఎస్సార్ కంటి వెలుగు’

ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగ సంస్కరణలతో విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యం విషయంలోనూ అంతే శ్రద్ద తీసుకొంటోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బాలల భవితపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే బాలల కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూలు పిల్లలకు తొలిసారిగా చేపట్టిన కంటి పరీక్షలు దాదాపు పూర్తి కావచ్చాయి.

రెండు దశల్లో నిర్వహణ..

ఈ పథకం కింద రాష్ట్రంలోని 66.17 లక్షల మంది స్కూలు పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. రెండు దశల్లో స్కూలు పిల్లలకు ఈ కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రాథమికంగా పిల్లల కళ్లను స్క్రీనింగ్ చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్ల సహాయంతో శిక్షణ పొందిన సిబ్బంది దీనిని పూర్తి చేశారు.

వివరాలు వెబ్ పోర్టల్లో నమోదు..

పరీక్షలు పూర్తయిన పిల్లల మెడికల్ రికార్డు, ఇతర వివరాలు అన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్ లో నమోదు చేశారు. 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం అని గుర్తించారు. వారందరికీ ఇప్పటికే కళ్లద్దాలు కూడా పంపిణీ చేశారు. 500 మందికి శస్త్రచికిత్సలు అవసరం అని గుర్తించారు. ఇప్పటికి 459 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు. వీలయినంత త్వరగా మిగిలిన 41 మందికి ఆపరేషన్లు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. అవి కూడా పూర్తి చేస్తే ఈ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం పూర్తి అవుతుందని అంటున్నారు.

పిల్లలకు కంటి రెప్పలా..

విద్యారంగంలో పలు విప్లవాత్మక పథకాలను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం పాఠశాలల్లో చేరికలు గణనీయంగా పెరిగేలా కృషి చేసింది. అమ్మఒడి, విద్యాదీవెన, విద్యావసతి, జగనన్న గోరుముద్ద, మన బడి నాడు-నేడు వంటి పలు పథకాలతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారీ బడులను తీర్చి దిద్దింది. వారికి పుస్తకాలు, యూనిఫారాలూ, బెల్ట్, బూట్లు, బ్యాగ్ అందజేస్తూ చదువులకు ఏ ఆటంకం లేకుండా చూస్తోంది. ఇప్పుడు ఎంతో ముందుచూపుతో పిల్లల కళ్లను సంరక్షించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలు చేయడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ ఆధునిక వైద్యం..

రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వ నివారణకు స్క్రీనింగ్ నుంచి సర్జరీ వరకు అన్ని స్థాయిల్లో అత్యాధునిక వైద్యం అందించేందుకు చర్యలు తీసుకొంటోంది. ఈ బాధ్యతలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అప్పగించారు. ఇటీవల తనను కలసిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టరు గుళ్లపల్లిరావు, వ్యవస్థాపక సభ్యుడు జి.ప్రతిభారావులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. రాష్ట్రంలో అన్ని అనాథ శరణాలయాల్లోని చిన్నారులకు నేత్ర వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ముందుకు వచ్చింది. ఈ విధంగా రాష్ట్రంలో అందరి కంటి ఆరోగ్యానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం గమనార్హం.