iDreamPost
android-app
ios-app

తెలంగాణలో కొత్త కరోనా కేసులు.. కేసిఆర్ సర్కార్ కీలక ఆదేశాలు

తెలంగాణలో కొత్త కరోనా కేసులు.. కేసిఆర్ సర్కార్ కీలక ఆదేశాలు

యూకే నుంచి వస్తున్నవారికి దేశంలోని విమానాశ్రయాల్లో తప్పనిసరిగా చేస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో వైరస్‌ నిర్ధారణ అవుతోంది. మంగళవారం వివిధచోట్ల ఇలా 16 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు ఈ నెల 11, 13 తేదీల్లో యూకే నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో సర్కారు అప్రమత్తమైంది. కొత్త స్ట్రెయిన్‌ పాజిటివ్‌ రోగులకు గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యం అందించాలని, వారితో కాంటాక్టు అయిన కుటుంబ సభ్యులను అమీర్‌పేట్‌లోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో ఐసొలేషన్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

3000 మంది తెలంగాణకు..

నాలుగు వారాల వ్యవధిలో బ్రిటన్‌ సహా ఇతర దేశాల నుంచి మూడు వేల మంది తెలంగాణకు వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖకు కేంద్రం నుంచి సమాచారం అందింది. వారిలో ముందు వచ్చిన 1,500 మందిని మెడికల్‌ అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మరో 1,500 మందికి బుధవారం నుంచి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు పాజిటివ్‌ వస్తే గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో ఉంచనున్నారు. టిమ్స్‌లో కొత్త స్ట్రెయిన్‌ పాజిటివ్‌ల కోసం ప్రత్యేకంగా గదులను సిద్ధం చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో 300 పడకలను సిద్ధం చేస్తున్నారు. కాగా, జిల్లాల్లో కొత్త స్ట్రెయిన్‌ పాజిటివ్‌లు తేలితే అక్కడ సర్కారు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచనున్నారు.

కేంద్రం అలర్ట్‌..

మరో వైపు కేంద్ర ప్రభుత్వం కొత్త స్ట్రెయిన్‌ విషయంలో ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రధానంగా కొత్త స్ట్రెయిన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి వెంటనే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌ వస్తే వారి నమూనాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని కోరింది. వాటిని జీనోమ్‌ సీక్వెన్సీ ల్యాబ్‌లకు పంపాలని ఆదేశించింది. అటువంటి నమూనాల్లో వైరస్‌ తీవ్రత ఎలా ఉందో పరీక్షించేందుకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. స్ట్రెయిన్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్‌ మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమాన ప్రయాణికులందరినీ పర్యవేక్షించనున్నారు.