iDreamPost
iDreamPost
దక్షిణాదిలోనే కాదు యావత్ భారత దేశంలో ఇళయరాజా పేరు తెలియని వారు, ఆయన సంగీతాన్ని ఆస్వాదించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళం అనే బాషా బేధం లేకుండా ప్రతి చోటా ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ అందించి తనకు తానే సాటి అని రుజువు చేసుకుని వెయ్యి సినిమాలకు పైగా ప్రయాణాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న ఇళయరాజా ఎక్కడికి వెళ్లినా తెల్లని జుబ్బా పంచెలో కనిపిస్తూ ఉంటారు.
లక్షలాది మంది గుమిగూడే లైవ్ కన్సర్ట్ అయినా, కొందరు టీమ్ సభ్యులు మాత్రమే ఉండే రికార్డింగ్ స్టూడియో అయినా రాజా వేషధారణలో ఎలాంటి మార్పు ఉండదు. చాలా అరుదుగా రాజాగారిని ప్యాంట్ షర్ట్ లో చూస్తూ ఉంటాం. అయితే ఈ వస్త్రధారణ వెనుక ఒక విశేషమైన కథ ఉందనేది చాలా కొద్దిమందికే తెలిసిన సత్యం. అదేంటో చూద్దాం.
కెరీర్ ప్రారంభంలో ఇళయరాజా ఓసారి లలిత సంగీతంలో కచేరీ ఇవ్వడం కోసం మైసూర్ వెళ్లారు. కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. టీమ్ అందరూ కలిసి బృందావన్ గార్డెన్స్ చూడాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ హఠాత్తుగా రాజాకు వణుకుతో కూడిన చలి జ్వరం వచ్చింది. దీంతో ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళందరూ వెళ్లిపోయారు. ఊహించని విధంగా శరీరంలో టెంపరేచర్ అంతకంతా పెరుగుతూ పోతోంది. రాజాకు ఈ జ్వరం ఇలాగే కొనసాగితే ప్రాణం పోతుందన్న భావన కూడా మొదలైంది. కుటుంబాన్ని తలుచుకోవడం మొదలుపెట్టారు.
ఆ క్షణంలో తన తల్లి మైసూర్ కు దగ్గరలో ఉన్న మూకాంబికా ఆలయం గురించి చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. వెంటనే ఆ మాతను తలుచుకుని కాపాడమని వేడుకున్నారు. అంతే కొన్ని నిమిషాల్లోనే రాజాకు ఒళ్ళంతా చెమటలు పట్టి సాధారణ స్థితిలో వచ్చేశారు. క్షణం ఆలస్యం చేయకుండా మూకాంబిక దర్శనం కోసం వెళ్ళిపోయి తిరిగిరాగానే ప్యాంటు షర్టులకు స్వస్తి పలికి అచ్చమైన పంచెకట్టులోకి మారిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పబ్లిక్ లైఫ్ లో రాజా కేవలం ఈ దుస్తులతోనే కనిపిస్తున్నారు. అంతేకాదు అప్పటి నుంచే స్వచ్ఛమైన శాఖాహారిగా మారిపోయారు. మూకాంబికా మాత ఆశీసుల వల్లే తన ప్రాణాలు నిలిచాయని నమ్మే రాజా ఇప్పటికీ ఆ తల్లి కీర్తనతోనే ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తారు