iDreamPost
android-app
ios-app

కథా పేరూ రెండూ మారిన ‘బాలకృష్ణుడు’ – Nostalgia

  • Published Jun 26, 2020 | 2:30 PM Updated Updated Jun 26, 2020 | 2:30 PM
కథా పేరూ రెండూ మారిన ‘బాలకృష్ణుడు’ – Nostalgia

స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లేముందు ఎన్నో మార్పులకు గురి కావడం సహజం. స్క్రిప్ట్ ని చివరి దాకా చెక్కే దర్శకులు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. ఇదంతా పర్ఫెక్షన్ కోసం పడే తాపత్రయమే తప్ప మరొకటి కాదు. అయితే పూర్తిగా టైటిల్, కథ రెండూ మారడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిదే ఇది. 1989లో బాలకృష్ణ హీరోగా ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో ‘బాలకృష్ణుడు’ అనే టైటిల్ తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. తమ హీరో పేరుతోనే చిత్రమనగానే షూటింగ్ కు ముందే అంచనాలు పెరిగిపోయాయి. అయితే కొద్దిరోజులు అయ్యాక అనూహ్యంగా కథ మారిపోయింది.

ముందు అనుకున్న లాయర్ పాత్ర కాకుండా కొత్త సబ్జెక్టులో డాన్ ని చేశారు. బాలకృష్ణుడు టైటిల్ కాస్తా ‘అశోక చక్రవర్తి’గా చేంజ్ అయ్యింది. దర్శకుడు మారలేదు. ఎస్ఎస్ రవిచంద్రనే కొనసాగించారు. పరుచూరి బ్రదర్స్ రచనతో ఇళయరాజా సంగీతంతో భానుప్రియ హీరోయిన్ గా స్వరూపమే మారిపోయింది. నిజానికి ఆ టైంలో మాఫియా డాన్ కథల హవా నడుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ తరహా చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తమిళంలోనూ కమల్ హాసన్ సత్య లాంటి ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అందుకే అశోక చక్రవర్తిని ముంబై బ్యాక్ డ్రాప్ లో చాలా భారీ బడ్జెట్ తో నిర్మించారు.

బాలకృష్ణుడు టైటిల్, కథ అలా పక్కకు వెళ్లిపోయాయి. కాని ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ముద్దుల మావయ్య లాంటి హెవీ సెంటిమెంట్ బ్లాక్ బస్టర్ తర్వాత అశోక చక్రవర్తి రావడంతో ప్రేక్షకులు దీన్ని అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు. దానికి తోడు కథనంలో ఉన్న కొన్ని లోపాలు, వీక్ క్లైమాక్స్ రిజల్ట్ మీద ప్రభావం చూపించాయి. ఒకవేళ ముందు అనుకున్న బాలకృష్ణుడునే తీసి ఉంటె ఏం జరిగేదో. తర్వాత ఇంకెవరు ఆ టైటిల్ వాడుకోలేదు కాని మూడు దశాబ్దాల తర్వాత 2017లో నారా రోహిత్ సినిమాకు పెట్టారు. విచిత్రంగా ఇదీ డిజాస్టర్ అయ్యింది.