iDreamPost
iDreamPost
గోవా రాజకీయాల్లో ఎమ్మెల్యేల జంపింగులు, కొనుగోళ్లు, బేరసారాలు కొత్త కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందడం అక్కడి నేతలకు అలవాటు. అధికారం కోసం పార్టీలు కూడా ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. అందుకే ఆ రాష్ట్రంలో తరచూ రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంటుంది. ప్రభుత్వాలు ఉన్నఫళంగా కుప్పకూలిపోతుంటాయి.
గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈ వలస రాజకీయాల వల్లే ప్రభుత్వం ఏర్పాటు చేయలేక, చివరకు తమ ఎమ్మెల్యేలను రక్షించుకోలేక చతికిలపడింది. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనూ అదే సీను రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో అవసరమైతే ఒక ప్రధాన పార్టీకి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు నలుగురు అభ్యర్థులు ఒక స్టింగ్ ఆపరేషన్లో వెల్లడించడం గోవా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం
గోవాలో అసెంబ్లీలో 40 స్థానాలకు ఈ నెల 14న ఎన్నికలు జరిగాయి. 79.84 శాతం భారీ పోలింగ్ నమోదైంది. 301 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. కాగా పోలింగుకు రెండు రోజుల ముందు ఒక న్యూస్ ఛానల్ ఎమ్మెల్యే అభ్యర్థులపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. గెలిస్తే ఏం చేస్తారు, పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పార్టీ వెంటే ఉంటారా అని ఆరా తీసేందుకు ప్రయత్నించింది. ఖచ్చితంగా గెలుస్తారన్న అంచనాలు ఉన్న నలుగురు అభ్యర్థులు నిర్మొహమాటంగా అసలు విషయం చెప్పేశారు.
తమకు వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించేందుకు అంగీకరిస్తే ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి సహకరించేందుకు తాము సిద్ధమేనని వారు స్పష్టం చేశారు. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలెమావో కూడా ఉండటం విశేషం. గోవా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంకల్ఫ్ అమాన్కర్, మరో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఫుర్టాడో ఆలర్టానో, సావియో డిసిల్వా కూడా సొంతలాభం కోసం బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు లేదా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
కేజ్రీవాల్ ఆరోపించినట్లే
గోవా రాజకీయాలు తెలిసినందునే ఆప్ అధినేత కేజ్రీవాల్ తమ పార్టీ అభ్యర్థుల నుంచి పార్టీ మారబోమంటూ అఫిడవిట్లు తీసుకున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్, టీఎంసీలకు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ప్రచారం చేశారు. పరిస్థితి చూస్తుంటే కేజ్రీవాల్ ఆరోపించినట్లే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడైన అంశాలతో ఉలిక్కిపడిన కాంగ్రెస్, టీఎంసీ నేతలు దానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సరళిని బట్టి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని పలు మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలు జరిగే ఆస్కారం ఉంది. 2017 ఎన్నికల్లోనూ అదే జరిగింది. 17 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కొని 13 స్థానాలు గెలిచిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి మిగిలిన ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని అధికారాన్ని సుస్థిరం చేసుకుంది.