iDreamPost
android-app
ios-app

ప్లాంట్‌ అమ్మకానికి కేంద్రం చేస్తున్న ప్రచారంలో నిజమెంత?

ప్లాంట్‌ అమ్మకానికి కేంద్రం చేస్తున్న ప్రచారంలో నిజమెంత?

విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణపై ఏపీ భగ్గుమంటున్నా కేంద్రం ముందుకే అడుగు వేస్తోంది. తీవ్రస్థాయిలో ఉద్యమం నడుస్తున్న సందర్భంలో అమ్మి తీరతామంటూ కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. ఎవరూ కొనకపోతే మూసేయడానికి కూడా వెనుకాడబోమంటూ కార్మికులు, ఉద్యోగుల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. వంద శాతం అమ్మేయడానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి రోజుకో తప్పుడు వాదనను తెరపైకి తెస్తోంది. తాము చెప్పేది వాస్తవాలని కేంద్రపెద్దలు, కాదని కంపెనీ సీనియర్లు చెప్పుకుంటున్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు ప్రజలు కట్టే పన్నులు ఎన్నాళ్లు పెడతామంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు పెరిగిపోయి ఉత్పాదకత తగ్గిపోయిందని, అందుకే స్టీల్‌ప్లాంటును విక్రయిస్తున్నామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా చేసిన ప్రకటనల నేపథ్యంలో అసలు ప్లాంట్‌ ప్రస్థానం మరోసారి తెరపైకి వచ్చింది.

ఉత్పాదకత పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు

విశాఖ స్టీల్‌ ప్లాంటు బీఐఎఫ్‌ఆర్‌ నుంచి బయటపడిన తర్వాత 2001 నుంచి 2015 వరకు లాభాల్లోనే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఐరన్‌ ఓర్‌ గనులు కేటాయిస్తే మరిన్ని లాభాలు పెరుగుతాయని సుదీర్ఘకాలంలో కేంద్రాన్ని కోరతూనే ఉన్నారు. ఇప్పటికీ సొంత గనులు లేని ఏకైక కర్మాగారంగా విశాఖ స్టీల్‌ప్లాంటు నిలిచిపోయింది. ఇప్పుడు ఆర్థిక మంత్రి చెబుతున్న ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు పెరుగుదలకు కారణం సొంత గనులు లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. 2015 నుంచి స్టీల్‌ప్లాంటుకు నష్టాలు వస్తున్నాయి. దీనికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. కేంద్రమంత్రి సీతారామన్‌ ఉత్పాదకత తగ్గిందని పేర్కొన్నారు. ఈ ఉత్పాదక శక్తిని పెంచుకోవడానికే ప్లాంటు యాజమాన్యం… కేంద్రాన్ని యాచించకుండా ఆర్జించిన లాభాలతో విస్తరణ పనులు చేపట్టింది. ఉత్పాదక తగ్గందంటున్న కేంద్రం అందుకు కారణాలు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపడితే పరిస్థితి మరోలా ఉండేది.

వడ్డీల భారం.. సొంత గనులు లేకపోవడం..

ప్లాంట్‌ వాస్తవిక సామర్థ్యం 34లక్షల టన్నులు కాగా, రూ.12 వేల కోట్లతో 63 లక్షల టన్నుల సామర్థ్యం కోసం 2005లో పనులు ప్రారంభించింది. ఆ తరువాత మరో రూ.4 వేల కోట్లు పెట్టి మరో 10 లక్షల టన్నుల సామర్థ్యం జోడించింది. ఇప్పుడు ప్లాంటు ఉత్పాదక సామర్థ్యం 73 లక్షల టన్నులు. విస్తరణకు వెచ్చించింది రూ.16 వేల కోట్లు. ఇందులో కొంత ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తెచ్చారు. విస్తరణ పనులు అనుకున్న సమయంలో పూర్తికాకపోవడంతో వడ్డీల భారం పెరిగింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా స్టీల్‌ మార్కెట్‌ మందగించింది. చైనా నుంచి విపరీతంగా తక్కువ రేటు స్టీల్‌ డంప్‌ అయ్యింది. అమ్మకాలు తగ్గిపోయాయి. డిమాండ్‌ పడిపోయింది. ఆ తరువాత ముడి ఇనుము ధరలు పెరిగిపోయాయి. ఇతర ప్లాంట్ల కంటే విశాఖ స్టీల్‌ప్లాంటుకు ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ.5 వేలు అదనంగా పడుతోంది. దీనికి సొంత గనులు లేకపోవడమే ప్రధాన కారణం. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని అనేక స్టీల్‌ప్లాంట్లు నష్టాల్లోకి వెళ్లాయి. అందులో విశాఖ స్టీల్‌ కూడా ఒకటి.

సరిదిద్దాల్సింది పోయి అమ్మేస్తారా..?

కొన్నేళ్ల క్రితం లాభాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంటుకు ఇప్పుడు ఎందుకు నష్టాలు వస్తున్నాయో అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ నష్టాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏకంగా ప్లాంటునే అమ్మేస్తాం… లేదంటే మూసేస్తాం అనడం సమంజసం కాదని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. సొంత గనులు కేటాయిస్తే… ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. ఉత్పాదకత తగ్గిపోవడానికి కూడా ఇదే కారణం. స్టీల్‌కు మార్కెట్‌లో డిమాండ్‌ లేనప్పుడు అత్యధిక మొత్తాలు పెట్టి 100 శాతం ఉత్పత్తి చేయడం నష్టమనే యాజమాన్యం 60 నుంచి 75 శాతం ఉత్పత్తినే చేస్తోంది. ఐరన్‌ఓర్‌ తక్కువ రేటుకు వచ్చేలా సొంత గనులు ఇస్తే… ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది కాబట్టి 100 శాతం ఉత్పాదకత సాధించడానికి అవకాశం ఉంటుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. తన వంతు బాధ్యతగా కేంద్రం గనులు కేటాయించి ఉంటే… ప్లాంటు నష్టాల బాట పట్టేదే కాదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ నరసింగరావు పేర్కొంటున్నారు. అది అమ్మేసే స్థితికి వచ్చేంత వరకు కేంద్ర ఉక్కు శాఖ ఎందుకు ఉపేక్షించిందనే వ్యాఖ్యలు, విమర్శలు వినిపిస్తున్నాయి. నష్టాలు మొదలైన వెంటనే.. దిద్దుబాటు చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని కార్మిక సంఘాలు నాయకులు ప్రశ్నిస్తున్నారు.