Idream media
Idream media
విభజన సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాలు ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాయి. పెద్దన్నగా వ్యవహరించి కేంద్రం రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరుతున్నాయి. అడపాదడపా సమావేశాలు నిర్వహించి సమస్యలను వింటున్నారు కానీ.. శాశ్వత పరిష్కారం చూపడం లేదు. తాజాగా రాష్ట్ర విభజన అంశాలపై ఆయన బుధవారం ఢిల్లీ నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమీర్ శర్మ, సోమేశ్‌కుమార్‌లతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా వర్చువల్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ డిస్కం ఏపీ జెన్కోకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలతో పాటు 10 ద్వైపాక్షిక అంశాలు, 8 ప్రాజెక్టులు, ఇతర అజెండా అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10ల్లో పేర్కొన్న సంస్థలకు సంబంధించిన వివాదాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ భవన్, విభజన చట్టంలోని 50, 51, 56 సెక్షన్లలో పేర్కొన్న విధంగా పన్ను బకాయిలు, పన్ను రీఫండ్ అంశాలపై సమీక్షించారు. చట్టంలో పొందుపరచని సంస్థల అపాయింట్‌మెంట్, డివిజన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్స్, బ్యాంకు డిపాజిట్లపైనా చర్చలు జరిగాయి.
సమీర్ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం 2014-15 ఏడాదికి సంబంధించిన రెవెన్యూ లోటు భర్తీ నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వివరించారు. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను వివరించారు. దుర్గరాజపట్నం ఓడరేవుకు బదులుగా రామాయపట్నం రేవు అభివృద్ధి, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, కేంద్రం నుంచి రావలసిన పన్ను రాయితీలు మొదలైనవాటిని భల్లా దృష్టికి తీసుకొచ్చారు. అన్నింటినీ విన్న భల్లా ఏ సమస్య పరిష్కారానికి కూడా తగిన హామీ ఇవ్వకుండా, రెండు రాష్ట్రాలకు అండగా ఉంటామని మాత్రం చెప్పారు.