Idream media
Idream media
ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతంగా జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎన్‌సీసీ గేటు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను విద్యార్థి సంఘం నేతలు దగ్ధం చేశారు. ఎన్‌సీసీ గేటు నుంచి బయటకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్(టీఎస్‌ఎస్) సభ్యులు ఆర్ట్స్ కాలేజీ ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఓయూ ఉద్యోగుల సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొంటున్నాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఆందోళన చేపట్టిన వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ్మినేని వీరభద్రం విమలక్క, చెరుకు సుధాకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రికత పరిస్థితులు తలెత్తాయి. డీజిల్ ట్యాంకర్ టైర్లకు మేకులు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఓ ప్రైవేటు డ్రైవర్‌ను కూడా ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ దగ్గరా కూడా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సుపై రాళ్లతో ఆందోళనకారులు దాడి చేయడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఈ బస్సును బందోబస్తు మధ్య ఆర్మూర్ పోలీసులు దాటించారు. ప్రయాణికులు లేక బస్టాండ్‌లు నిర్మానుష్యంగా మారాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. పోలీసుల పర్యవేక్షణలో డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను అధికారులు బయటకు పంపుతున్నారు. ప్రతీ బస్సులో పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీ బంద్‌కు వాణిజ్య, వర్తక సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ బంద్ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.