iDreamPost
android-app
ios-app

లేడీ పోలీస్ సత్తా చాటిన ‘కర్తవ్యం’ – Nostalgia

  • Published Jun 24, 2020 | 2:29 PM Updated Updated Jun 24, 2020 | 2:29 PM
లేడీ పోలీస్ సత్తా చాటిన ‘కర్తవ్యం’ – Nostalgia

సాధారణంగా ఏ బాషా సినిమా పరిశ్రమలోనైనా కమర్షియల్ హీరోకున్న ఇమేజ్ హీరోయిన్లకు ఉండదు. గ్లామర్ పరంగా ఎంత పేరు, డబ్బు సంపాదించినా ఈ ఒక్క విషయంలో కొంత వెనుకబడే ఉంటారు. కానీ దాన్ని మార్చి చూపించిన లేడీ అమితాబ్ గా విజయశాంతిని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 90వ దశకంలో పవర్ ఫుల్ పాత్రల ద్వారా తనను తాను ఆవిష్కరించిన తీరుకి స్టార్లతో సమానంగా ఇంకా చెప్పాలంటే కొందరి కంటే చాలా ఎక్కువ స్థాయికి వెళ్లిపోయింది. దానికి దోహదం చేసినవాటిలో మొదటి సినిమా ప్రతిఘటన అయితే రెండోది కర్తవ్యం. 1990లో ఏ మోహనగాంధీ దర్శకత్వం ఏఎం రత్నం నిర్మించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుని దేశవ్యాప్తంగా తన పేరు మారుమ్రోగిపోయేలా చేసిన కిరణ్ బేడీ ఐపిఎస్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పరుచూరి బ్రదర్స్ దీనికి రచన చేశారు. సమాజంలో జరుగుతున్న దురాగతాలకు ఒక మహిళా ఖాకీ ఎదురొడ్డి వాటిపై విజయం సాధించిన తీరు క్లాసు మాస్ తేడా లేకుండా అందరిని మెప్పించింది. ముఖ్యంగా విజయశాంతి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. వృత్తి పట్ల నిబద్దత, అన్యాయాల పట్ల ఉక్కుపాదం మోపాలన్న సంకల్పం ఒళ్ళంతా నింపుకున్న ఆఫీసర్ గా ఆమె నటన అద్భుతంగా సాగి జాతీయ అవార్డును సాధించి పెట్టింది. సెకండ్ హాఫ్ లో విలన్లు తనను శారీరకంగా కదలలేని స్థితికి తీసుకొచ్చినా మొక్కవోని ధైర్యంతో ఎదిరించి విజేతగా నిలిచిన తీరు అప్పటి తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచి వాళ్ళను పోలీస్ ఉద్యోగాల వైపు ప్రేరేపించడం అతిశయోక్తి కాదు.

విలన్ గా నటించిన పండరికాక్షయ్య నిజంగానే జనాన్ని భయపెట్టారు. వినోద్ కుమార్, చరణ్ రాజ్, నిర్మలమ్మ, పరుచూరి వెంకటేశ్వరరావు, సాయికుమార్, నూతన్ ప్రసాద్ తదితరులు తమ పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. మాస మహారాజా రవితేజ ఇందులో సాయి కుమార్ బ్యాచ్ లో ఫ్రెండ్ గా చాలా చిన్న వేషం వేయడం గమనించవచ్చు.రాజ్ కోటి సంగీతం కూడా దన్నుగా నిలిచింది. వీళ్ళందరూ ఒక ఎత్తైతే విజయశాంతి నటన మరో ఎత్తు. హీరోయిన్లు కూడా ఒళ్ళు గగుర్పొడిచేల ఫైట్లు చేయొచ్చని నిరూపించడం చూసి మాస్ వెర్రెక్కిపోయారు. దీన్నే హిందీలో వైజయంతి ఐపీఎస్ పేరుతో రీమేక్ చేస్తే అక్కడా ఘన విజయం సాధించింది. అందుకే మూడు దశాబ్దాలు అవుతున్నా విజయశాంతి పుట్టినరోజైన జూన్ 24న అభిమానులు కర్తవ్యం సినిమాను గుర్తు చేసుకోకుండా ఉండలేరు.