Idream media
Idream media
కరుణానిధి వారసుడు, 68 ఏళ్ల వయసులో తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన స్టాలిన్ సరికొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే తాను హామీ ఇచ్చిన అంశాల్లో ఐదింటిపై సంతకాలు చేసిన ఆయన కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. పదవిని చేపట్టిన వెంటనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. వినూత్నంగా ఉంటున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో విపక్ష నేత ఇంటికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లటం లాంటివి చాలా అరుదు. విపత్తు కాలంలో అధికారం, ప్రతిపక్షం కలిసి చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంగా కేరళ ఖ్యాతి పొందింది. ఇప్పుడు స్టాలిన్ కూడా ఆ విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. ప్రతిపక్ష నేత పన్నీర్ సెల్వం ఇంటికి నేరుగా వెళ్లిన స్టాలిన్ అఖిల పక్ష భేటీకి రావాల్సిందిగా కోరారు. అలాగే అమ్మ క్యాంటిన్ లను కొనసాగిస్తున్నారు.
13 పార్టీలు
కరోనా నియంత్రణకు పలు ఆంక్షలు విధించినా, లాక్‌డౌన్ అమలు చేసినా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఎలాగైనా రాష్ట్రంలో కొవిడ్ ను తగ్గించడమే ధ్యేయంగా స్టాలిన్ రాజకీయాలను పక్కన బెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ గురువారం అసెంబ్లీ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనా నియంత్రణ చర్యలపై నేతల అభిప్రాయాలు సేకరించారు. డీఎంకే తరఫున టీఆర్ బాలు, ఆర్‌ఎస్ భారతి, అన్నాడీఎంకే నుంచి జయకుమార్, పరమశివం, కాంగ్రెస్ నుంచి విజయధరణి, మునిరత్నం, బీజేపీ నుంచి నయనార్ నాగేంద్రన్, పీఎంకే, ఎండీఎంకే వీసీకే, సీపీఎం, ఎంఎంకే, కేఎండీకే, టీవీకే తదితర 13 పార్టీల నేతలు హాజరయ్యారు.
అఖలపక్షంలో ఐదు తీర్మానాలు
అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైద్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ మీడియాకు వివరించారు. కరోనా నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే అవసరమైన అన్ని చర్యల్లో పాలుపంచుకోవాలని, అన్నిపార్టీల సభలు, సమావేశాలు, ఇతర పార్టీ కార్యకలాపాలను నిలిపివేయాలని తీర్మానించారు. అలాగే సంపూర్ణ లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలని, కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు అన్ని పార్టీలు సహకారం అందించాలని పేర్కొన్నారు. కరోనా కట్టడికి అఖిలపక్ష పార్టీ సభ్యులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోనా రోగులను చివరి క్షణంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించడం అమానవీయ చర్య అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి పెరగగానే రెమ్‌డెసివర్ మందును సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు.
ఈ తరహా రాజకీయం
విపత్తు వేళ రాజకీయాలను పక్కన బెట్టి స్టాలిన్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో వ్యక్తిగత వైరం తమిళనాడులో తారాస్థాయికి చేరుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటిది.. రాజకీయ శత్రువు వేరు.. రాజకీయ ప్రత్యర్థి వేరన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించటమే కాదు.. పాత రాజకీయాల్ని వదిలేసి.. సరికొత్తగా అడుగులు వేద్దామన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నంతనే తనకు మించినోళ్లు లేరన్న భావనకు పోకుండా అందరిని కలుపుకుపోయేలా వేసే అడుగుల్ని చూస్తే ఈ తరహా రాజకీయం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది.