iDreamPost
android-app
ios-app

మంత్రిగా పని చేశారు కదా..? ఆ మాత్రం తెలియదా కాల్వ శ్రీనివాస్ గారు

మంత్రిగా పని చేశారు కదా..? ఆ మాత్రం తెలియదా కాల్వ శ్రీనివాస్ గారు

అక్షరాస్యత పెరగడం, ప్రచార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల వల్ల ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కొంత మంది రాజకీయ నాయకులు తాము చేసే ప్రకటనలను ఒకటికి రెండుసార్లు చూసుకుని చేస్తుంటారు. ఒకసారి ప్రజల్లోకి తమ ప్రకటన వెళ్లిన తర్వాత.. తిరిగి తీసుకోలేం. ఆ మాట ఎందుకు అన్నారు..? ఏ లక్ష్యంతో అన్నారు..? ఆయన ఉద్దేశం ఏమిటి..? ఇలా రకరకాలుగా ప్రజల్లో విశ్లేషణలు సాగుతాయి. మునుపటి మాదిరిగా రాజకీయ నాయకుడు ఏది చెబితే.. అది నమ్మి పాటించే కాలం కాదిది.

కాలం మారింది కానీ కొంత మంది రాజకీయ తీరు మాత్రం మారలేదు. ఇప్పటికీ తమ ప్రకటనలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, రెచ్చగొట్టడం, ప్రభుత్వంపై ఉసిగొలప్పడం చేయొచ్చని భావిస్తున్నారు. ఈ తరహాకు చెందిన వ్యక్తే టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. వైసీపీ ప్రభుత్వంపై వాల్మీకి, బోయ సమాజికవర్గాల వారిని ఉసిగొల్పేందుకు తాజాగా ఆయన ఓ ప్రకటన చేశారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తరతరాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నామన్న ఆయన.. టీడీపీ ప్రభుత్వంలో ఈ విషయంపై అధ్యయనం చేయించామని క్రెడిట్‌ సొంతం చేసుకునేలా వ్యవహరించారు. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రివర్గ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు. మూడేళ్లు అవుతున్నా కేంద్రం పరిశీలనలో మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : పోలవరం పనులు జరగటం లేదా?కళ్ళు తెరిచి చూడండి దేవినేని ఉమా గారు..

ఈ మాట చెప్పిన కాల్వ శ్రీనివాసులు.. వైసీపీ ప్రభుత్వంపై అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. మేము ఇంత చేస్తే.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని, వాల్మీకిలు, బోయలంటే సీఎం వైఎస్‌ జగన్‌కు ఎందుకు అంత కక్ష అంటూ ఆయా సామాజికవర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తక్షణమే వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చే అంశం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేసి.. ఆయా సామాజికవర్గాల కోసం తాను కృషి చేస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చారు.

వాల్మీకి, బోయ సమాజికవర్గాలను ఎస్టీల్లో చేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందన్న కాల్వ శ్రీనివాసులు.. ఆ మాటల్లోనే తమ  చిత్తశుద్ధి ఏమిటో కూడా తెలియజేశారు. తరతరాలుగా ఉన్న డిమాండ్‌ను తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఎందుకు కేబినెట్‌ తీర్మానం చేసి, కేంద్రానికి పంపలేదనే ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది. 2014 నుంచి 2018 వరకు నాలుగేళ్లపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అలాంటప్పుడు బోయలను, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ సులువుగా పూర్తయ్యేది. అప్పుడు ఎందుకు చేయలేదు.

Also Read: జెండా ఏదైనా అజెండా బాబుదే!

ఎన్నికలకు ఏడాది ఉందనగా బీజేపీతో తెగతెంపులు చేసుకుని వచ్చిన తర్వాతనే చంద్రబాబు కేబినెట్‌ వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చేలా తీర్మానం చేయడంలో చిత్తశుద్ధి ఎంత..? నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్నప్పుడు చేయని తీర్మానం, ఎన్నికలకు ఏడాది ముందుగా, అదీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత చేయడంలో టీడీపీ అసలు లక్ష్యం ఇట్టే తెలిసిపోతోంది. చేయాల్సిన సమయలో పని చేయకుండా.. ఇప్పుడు తీర్మానం చేసి మూడేళ్లు కావస్తోంది, కదలికలేదు అంటూ ముసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్ముతారా..?

కులాల కేటగిరిలను మార్చుతామని, తద్వారా రిజర్వేషన్లు లభిస్తాయని చెబుతూ.. వివిధ కులాల వారిని 2014 ఎన్నికల్లో ఏ విధంగా ఏమార్చింది టీడీపీ మేనిఫెస్టో చూస్తే తెలుస్తుంది. కాపులను బీసీల్లో చేరుస్తామని, రజకులను ఎస్సీ కేటగిరిలో చేరుస్తామంటూ టీడీపీ ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కాల్వ శ్రీనివాసులకు గుర్తుందా..? ప్రజలు.. రాజకీయ నేతల ప్రతి కదలికను, మాటను గమనించి, విశ్లేషించి తప్పొప్పులను ఎంచే కాలంలో ఉన్నామని కాల్వ శ్రీనివాసులు ఎప్పుడు గుర్తిస్తారో..?

Also Read : రెడ్డిసుబ్రమణ్యం ఎన్నికల వరకు ఉంటాడా?తాత్కాలిక సర్దుబాటేనా ?