iDreamPost
android-app
ios-app

మహేష్ బాబు మరో పదేళ్లు రాజమౌళికే అంకితం!

  • Published Dec 31, 2022 | 5:35 PM Updated Updated Dec 31, 2022 | 5:37 PM
మహేష్ బాబు మరో పదేళ్లు రాజమౌళికే అంకితం!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే హీరో క్రేజ్ ఎన్నో రెట్లు ఒక్కసారిగా పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో హీరోలు.. ఇతర సినిమాలు చేయకుండా ఏళ్లకు ఏళ్లు రాజమౌళి ప్రాజెక్ట్ కే అంకితం అవ్వాల్సి ఉంటుంది. బాహుబలి ఫ్రాంచైజ్ కోసం ప్రభాస్ నాలుగేళ్లకు పైగా కేటాయించాడు. ఇక ఆర్ఆర్ఆర్ కి ముందు ఏకంగా నాలుగేళ్లు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమానే విడుదల కాలేదు. ఇలా రాజమౌళి సినిమా అంటే హీరో కనీసం నాలుగైదేళ్లు కేటాయించాల్సి ఉంటుంది. అందుకే హీరోల అభిమానులు.. రాజమౌళి సినిమాతో తమ హీరో క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఆనందపడుతూనే, మరోవైపు తమ హీరోని మళ్ళీ ఎన్నేళ్లకు బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటామా అని బాధపడుతుంటారు.

ఇప్పటిదాకా రాజమౌళి సినిమా కోసం నాలుగైదేళ్లు కేటాయించిన హీరోలు ఉన్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఏకంగా పదేళ్ల పాటు రాజమౌళి దగ్గర లాక్ అయ్యే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మహేష్.. ఆ తర్వాత రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ అడ్వెంచర్ ఫిల్మ్ పట్టాలెక్కాలంటే ఏడాదికి పైగా పట్టే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఫ్రాంచైజ్ లా తీయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.

బాహుబలిని రెండు భాగాలుగా రూపొందిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ ని మాత్రం ఒక భాగంగానే తెరకెక్కించాడు. సీక్వెల్ చేసే ఆలోచన ఉందని చెప్పాడు కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. మరోవైపు మహేష్ చిత్రాన్ని మాత్రం హాలీవుడ్ తరహాలో ఫ్రాంచైజ్ లా ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ రివీల్ చేయడం విశేషం. మహేష్ తో చేసే ప్రాజెక్ట్ ఫ్రాంచైజ్ అని, ఇందులో చాలా భాగాలు ఉంటాయని, మహేష్ తో పాటు మరికొందరు స్టార్స్ కూడా నటించే అవకాశముందని చెప్పాడు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకి మునుపటి కంటే చాలా ఎక్కువ సమయం తీసుకునే ఛాన్స్ ఉంది. పైగా మహేష్ తో మూవీని పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన ఈ ఫ్రాంచైజ్ నుంచి రెండు భాగాలు రావడానికే పదేళ్లు పట్టినా ఆశ్చర్యంలేదు. అంటే త్రివిక్రమ్ మూవీ తర్వాత మహేష్ కనీసం పదేళ్లు రాజమౌళితోనే ట్రావెల్ చేసే అవకాశం ఉందన్నమాట.