iDreamPost
android-app
ios-app

అవతార్ దర్శకుడే శభాష్ అన్నారు

  • Published Jan 16, 2023 | 12:45 PM Updated Updated Jan 16, 2023 | 12:50 PM
అవతార్ దర్శకుడే శభాష్ అన్నారు

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయినా విదేశాల్లో మాత్రం అంతకంతా పెరుగుతూనే ఉంది. ఇటీవలే నాటునాటుకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కాక తాజాగా క్రిటిస్ ఛాయస్ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ మూవీ కింద పురస్కారం దక్కడం మరో కలికితురాయిని అందించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రపంచవ్యాప్తంగా మూవీ మేకర్స్ ఒక గ్రామర్ పుస్తకంగా భావించే అవతార్ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ రాజమౌళితో పది నిమిషాల పాటు ఆర్ఆర్ఆర్ గురించి చర్చించి మెచ్చుకోవడం. అంతే కాదు అయన భార్య సుజికి పర్సనల్ గా రికమండ్ చేసి మరీ దగ్గరుండి రెండో సారి తాను చూస్తూ ఎంజాయ్ చేశారట. ఆ రేంజ్ లో ఉంది మేనియా.

ఇటీవలే జురాసిక్ పార్క్ సృష్టికర్త స్టీవెన్ స్పీల్బర్గ్ జక్కన్నను ప్రత్యేకంగా మెచ్చుకోవడం గుర్తుందిగా. అసలు పరిశ్రమకు రాకముందు తానో గొప్ప అద్భుతంగా భావించిన మాస్టర్ పీస్ ఇచ్చిన దిగ్గజం స్వయంగా పొగిడే సరికి రాజమౌళి ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా. ఇక అవతార్ లాంటి విజువల్ వండర్ ఇచ్చి వరల్డ్ వైడ్ వేలాది కోట్లను కొల్లగొట్టిన జేమ్స్ క్యామరూన్ సైతం అదే స్థాయిలో శభాష్ అంటే అంతకన్నా కావలసింది ఏముంటుంది. జక్కన్నకే కాదు తెలుగు సినిమాను అభిమానించే ప్రతిఒక్కరికి ఈ పరిణామాలు కలిగిస్తున్న ఆనందం అంతా ఇంతా కాదు.గోల్డెన్ గ్లోబ్ తర్వాత చరణ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చేయగా తారక్ రేపో ఎల్లుండో రిటర్న్ అవుతాడు

ఇక మార్చిలో జరిగే ఆస్కార్ సంరంభం వరకు ఆర్ఆర్ఆర్ సందడి ఇంకా కొనసాగనుంది. ఏదో ఒక క్యాటగిరీలో అవార్డు కన్ఫర్మ్ అనే మాట అయితే వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అప్పుడు జరగబోయే సంబరం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. ఓటింగ్ మొదలైన నేపథ్యంలో జక్కన్న ప్రమోషన్ విషయంలో ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టడం లేదు. వరల్డ్ లెజెండ్స్ ఇంతగా మెచ్చుకుంటున్న ఆర్ఆర్ఆర్ నిజంగా ఆస్కార్ పురస్కారానికి అర్హమైందే. కాకపోతే అంత పోటీని తట్టుకుని నెగ్గుకురావడం మాత్రం సులభం కాదు. బాహుబలి ఎంత గొప్పగా ఆడినా దాన్ని మించిన ఖ్యాతిని రీచ్ ని ఆర్ఆర్ఆర్ తీసుకొచ్చిన మాట వాస్తవం.