పెళ్లిచూపులు సినిమాతో చిన్న నిర్మాతల్లో పెద్దనిర్మాతగా పేరుపొందారు రాజ్ కందుకూరి. అయన తన కొడుకు శివ కందుకూరితో రేపు అరంగేట్రం చేయిస్తున్నారు. “చూసీ చూడంగానే”కి ఉన్నంతలో మంచి బజ్ తీసుకురాగలిగారు నిర్మాత రాజ్. ఎక్కడా రాజీపడకుండా గోపీసుందర్ వంటి సంగీత దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక బృందాన్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. పాటలు కూడా బాగున్నాయి.
అయితే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో గెస్టుగా వచ్చిన శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ “శివని చూస్తుంటే నాకు రణబీర్ కపూర్ లా అనిపిస్తున్నాడు” అన్నాడు. ఆ క్షణానికి చప్పట్లు మోగాయి. అయితే మరొక కోణం నుంచి ఆలోచిస్తే అప్పుడే అంత పెద్ద నటులతో పోల్చడం పిల్లవాడి మీద పెనుభారం మోపినట్టు అవుతుందని కొందరు అభిప్రాయపడ్డారు.
లుక్స్ తో పాటూ నటనాప్రతిభకూడా కనబరిస్తేనే ఇక్కడ మనుగడ.ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద నటులతో పోలుస్తూ వేదికలమీద స్పీచులివ్వడం ఆ క్షణానికి బాగానే ఉన్నా ఇండైరెక్టుగా అది యువహీరోలకి మంచిది కాదు అనేది వక్తలు గుర్తించాలి.
రణబీర్ కపూర్ లాగ ఆ స్థాయి స్టార్డం తెచ్చుకుని నిలబడగలిగే సామర్ద్థ్యం శివ కందుకూరికి ఉందని ఈ సినిమాని ఇప్పటికే చూసినవాళ్ళు చెప్తున్నారు. అదే నిజమైతే అవసరాల పోలికని తప్పుబట్టలేం. చూద్దాం రేపు ప్రజాతీర్పు ఎలా ఉండబోతోందో.