iDreamPost
android-app
ios-app

Sri Krishnarjuna Vijayamu : కృష్ణార్జునులుగా బాలయ్య కష్టానికి దక్కని ఫలితం – Nostalgia

  • Published Dec 21, 2021 | 11:41 AM Updated Updated Dec 21, 2021 | 11:41 AM
Sri Krishnarjuna Vijayamu : కృష్ణార్జునులుగా బాలయ్య కష్టానికి దక్కని ఫలితం – Nostalgia

ఏదైనా కొత్త ప్రయత్నం లేదా ప్రయోగం చేస్తున్నప్పుడు వర్తమాన సామజిక పరిస్థితులు ప్రేక్షకుల అభిరుచులు దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. లేదా ఎంత గొప్ప దర్శకులైనా సరే చేదు ఫలితాలను అందుకోవాల్సి వస్తుంది. ఎలా అంటారా. చూద్దాం. 1996లో సుప్రసిద్ధ విజయా సంస్థ నందమూరి బాలకృష్ణతో ఓ ఇతిహాస చిత్రాన్ని ప్లాన్ చేసుకుంది. 1993 బ్లాక్ బస్టర్ భైరవ ద్వీపం కాంబినేషన్ కావడంతో ప్రకటన నాడే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. మాయాబజార్ స్ఫూర్తితో మహాభారత గాథలోని కీలకమైన రెండు ఘట్టాలను తీసుకుని దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు రచయిత రావికొండలరావుతో స్క్రిప్ట్ ని సిద్ధం చేయించారు.

అప్పటికే విజయ వారికి ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన మాధవిపెద్ది సురేష్ కే ఈ బాధ్యతలు అప్పగించారు. ఫైనల్ వెర్షన్ రెడీ కావడానికి నెలలు పట్టింది. బడ్జెట్ కూడా కోట్లకు చేరుకుంది. అప్పటికే ఇలాంటి కథలను తెరమీద చూపించడం పూర్తిగా ఆగిపోయింది. దానవీరశూరకర్ణ తరహాలో ఓ మహా దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించాలన్నది సింగీతం వారి కోరిక. విద్యాప్రదర్శనతో పాటు ద్రౌపది పరిణయాన్ని ఇందులో నేపథ్యంగా తీసుకున్నారు. అప్పట్లో వచ్చిన మీడియా కథనాల ప్రకారం తొలుత కృష్ణుడి పాత్రను శోభన్ బాబుతో వేయించాలనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల అర్జునుడి క్యారెక్టర్ తో పాటు దీన్ని బాలయ్యే డ్యూయల్ రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు గెటప్పులు కోసం ప్రత్యేకంగా ఫోటో సెషన్లు ట్రయిల్ షూట్లు చేశారు. అనీ బాగా వచ్చాయి

టైటిల్ శ్రీ కృష్ణార్జున విజయంగా నిర్ణయించారు. క్యాస్టింగ్ ఇండస్ట్రీని షాక్ చేసింది. రోజా, రంభ, ప్రియరామన్, నరేష్, శ్రీహరి, శుభలేఖ సుధాకర్, విజయరంగరాజు, పద్మనాభం, సుత్తివేలు, ఏవిఎస్ కెఆర్ విజయ, రమాప్రభ ఇలా ఇండస్ట్రీలోని టాప్ క్యాస్టింగ్ అంతా ఇందులో తీసుకున్నారు. 1996 మే 15 విడుదలైన శ్రీకృష్ణార్జున విజయం సుదీర్ఘమైన కథాకథనాలతో పాటు ఆసక్తికరమైన నెరేషన్ లేకపోవడంతో అంచనాలు అందుకోలేకపోయింది. దీనికి ముందు వెనుక 9న రిలీజైన భారతీయుడు, 22న వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఘనవిజయాలు మధ్య ఫ్లాప్ గా మిగిలింది. అయినప్పటికీ ఉత్తమ సంగీత దర్శకుడు, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో నంది అవార్డులు దక్కడం టీం పనితనానికి మచ్చుతునక.

Also Read : Veedevadandi Babu : నవ్వులు పూసినా కాసులు కురిపించలేదు – Nostalgia