iDreamPost
android-app
ios-app

ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి అవాస్తవాలతో ప్రచారం, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయడానికేనా ?

  • Published Jul 28, 2021 | 1:17 PM Updated Updated Jul 28, 2021 | 1:17 PM
ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి అవాస్తవాలతో ప్రచారం, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయడానికేనా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం ఆర్థిక సలహాదారు దువ్వూరి కృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అప్పులు- ఆస్తుల వివరాలను ఆయన వివరించారు. మాజీ ఆర్థికమంత్రి యనమల సహా అనేక మంది విపక్ష నేతలు, కొందరు మీడియాలోనూ ప్రభుత్వానికి సంబంధించిన వాస్తవాలను పక్కన పెట్టి విష ప్రచారం చేస్తున్నారని అబిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత రూ. 97123 కోట్ల అప్పులతో ఉన్నామని, చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సరికి రాష్ట్రం అప్పులు రూ. 2,62,225 కోట్లకు చేరిందన్నారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలో వివిధ పెండింగ్ పనులకు సంబంధించి రూ. 39వేల కోట్ల బకాయిలున్నట్టు వివరించారు. వాటిని చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై పడిందని తెలిపారు. చంద్రబాబు గద్దెనెక్కే నాటికి రాష్ట్రంలో వివిద కార్పోరేషన్ల అప్పులు రూ. 14వేల కోట్లు ఉంటే వాటిని రూ. 58వేల కోట్లకు పెంచారని చెప్పారు. 2014 మార్చి 31న పవర్ సెక్టార్ లో రూ. 38577 కోట్లుగా ఉన్న అప్పు ఐదేళ్లలో రూ 78 వేల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. కేవలం డిస్కమ్ కి సంబంధించి బకాయిలు 2800 కోట్ల నుంచి 21వేల కోట్లకు చేర్చడంతో ప్రస్తుతం యూనిట్ కి వసూలు చేస్తున్న బిల్లులో రూ. 1.20పై. కేవలం వడ్డీలు చెల్లించడానికే సరిపోతోందన్నారు.

2014-19 వరకూ కేంద్రం అప్పులు 9.78 ఏటా వృద్ధి రేటుతో ఉంటే 17.33 చొప్పున అప్పులు పెరిగాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అప్పులు చేసినా అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేశారని దాని ఫలితంగా అప్పుల భారం పెరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు వంటి పథకాల ద్వారా విద్య, వైద్య రంగాలకు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వమే అప్పులు చేస్తుందనే అవాస్తవాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్న తీరుని ఆయన తప్పుబట్టారు. చివరకు చంద్రబాబు హయంలో రైతులకు రుణమాఫీ 85వేల కోట్లు ఉంటే అందులో కేవలం 15కోట్లు మాత్రమే చేశారన్నారు.

Also Read : సీఎం పీఠంపై తండ్రులు.. తనయులు

చంద్రబాబు హయంలో చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ పరిమితికి మించి అప్పులు చేసినట్టు లెక్కలు చూపించారు. 2016-17లో రూ.4018 2017-18 లో రూ. 1048 2018-19లో రూ. 10,175 లో మొత్తం రూ. 17వేల కోట్లు ఎక్కువగా అప్పులు చేశారు. వాటి మూలంగానే ఇటీవల కేంద్రం నుంచి తమకు లేఖలు వచ్చి అదనపు అప్పులు చేసినట్టు వెల్లడించారని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలన్నీ ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. 2019లో గ్రాస్ ట్యాక్స్ వసూళ్ల మైనస్ లో ఉన్నాయనే విషయాన్ని ఆయన తెలిపారు. ఆర్థికరంగాన్ని కాపాడేందుకు పబ్లిక్ మనీ అదనంగా ఖర్చు చేయాలనే ఆర్థిక సూత్రాన్ని పాటిస్తున్నట్టు వెల్లడించారు.

ఇక కేంద్రం నుంచి వచ్చే పథకాల్లో రాష్ట్రమే అదనంగా 50లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోందని ఆయన వివరించారు. రూ. 34833 కోట్లు వస్తుందని 4.35 శాతం అంచనా వేస్తే 2019-20లో కేంద్రం నుంచి రూ. 28340 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. 2020-21లో రూ. 7780 కోట్లు కేంద్రం నుంచి వచ్చే రాష్ట్ర పన్నుల వాటా తగ్గిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల్లో మరో రూ. 7వేల కోట్లు తగ్గిపోయాయి. అదే సమయంలో రూ. 8వేల కోట్లు అదనంగా కోవిడ్ నియంత్రణ ఖర్చు అయ్యింది. మొత్తంగా రూ. 25వేల కోట్లు అదనపు భారం అయినప్పుడు ఏ ప్రభుత్వమయినా అప్పులు చేయాల్సిందే తప్ప మరో మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వేత్తలంతా ప్రజలకు నగదు బదిలీ చేయడం ద్వారా మాత్రమే ఆర్థిక రంగాన్ని కాపాడగలమనే విషయాన్ని చెప్పినట్టు గుర్తు చేశారు.

2014-19లో చేసిన అప్పులు సద్వినియోగం జరగకపోవడం, 2019లో ఆర్థిక పరిస్థితి దిగజారడం, గడిచిన రెండేళ్లుగా కోవిడ్ పరిస్థితులతో విపత్కర స్థితికి చేరామని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రజా సంక్షేమానికి వెనకడుగు వేయకుండా కష్టాల్లోనే ముందుకెళుతున్నట్టు వివరించారు. అప్పులు పెరగడానికి కారణాలు అనేకం ఉన్నాయనే విషయాన్ని దువ్వూరి కృష్ణ తెలిపారు. వివిధ దేశాలతో పాటుగా కేంద్రం, వివిధ రాష్ట్రాలు కూడా అప్పులతోనే సాగుతున్నాయని ఆయన అనేక ఉదాహరణలు అందించారు.

Also Read : అప్పులపై శ్వేతపత్రం అడగొచ్చు కదా..?