iDreamPost
android-app
ios-app

Special Observer, Kuppam Counting – కుప్పం ఓట్ల లెక్కింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Special Observer, Kuppam Counting – కుప్పం ఓట్ల లెక్కింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు

మినీ మున్సిపల్‌ ఎన్నికల్లో.. తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారిన కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సోమవారం పోలింగ్‌ జరగ్గా.. రేపు బుధవారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి. పోలింగ్‌ జరిగిన రోజు దొంగ ఓట్లు అంటూ రోడ్లపై ఉన్న వారిని పట్టుకుని హడావుడి చేసిన టీడీపీ.. ఎన్నికల్లో ఏదో జరిగిపోతోందనే భావనను రెకెత్తించేందుకు యత్నించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా.. పోలింగ్‌ జరుగుతున్న సమయంలోనే మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కుప్పంతోపాటు పలు చోట్ల దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో టీడీపీ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. కుప్పం ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని కోరుతూ.. హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

టీడీపీ కుప్పం మున్సిపల్‌ అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వాదనలను ఆలకించింది. పిటిషన్‌దారుల వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు.. వారు కోరినట్లుగా ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ‌కు ఆదేశాలు జారీ చేసింది. పరిశీలకుడిగా ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్‌ రెడ్డి పేరును హైకోర్టు సూచించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను అంతా వీడియో రికార్డు చేయాలని, ఆ ఫుటేజీని తమకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read :  Fack Votes, Chandrababu Naidu, Kuppam – ఆడలేక మద్దెల వోడు..ప్రతి ఎన్నికల్లోనూ బాబు ఎత్తుగడ

అందరికీ మంచిదే..

టీడీపీ అభ్యర్థులు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని కోరడం, హైకోర్టు అందుకు తగిన విధంగా ఆదేశాలు జారీ చేయడం అటు టీడీపీతోపాటు ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మంచి జరగనుంది. పోలింగ్‌ జరిగే సమయంలో పోలింగ్‌ బూత్‌లో కాకుండా.. రోడ్లపై ఉన్న వారి వద్దకు వెళ్లి దొంగ ఓటర్లు అంటూ హడావుడి చేసిన టీడీపీ.. రేపు ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తే.. ఓట్ల లెక్కింపులోనూ అక్రమాలకు పాల్పడ్డారని, ఫలితాలను తారుమారు చేశారనే ఆరోపణలు చేయకుండా ఉండదు.

నిన్నటి మాదిరిగానే.. రేపు బుధవారం ఫలితాలు రాగానే.. ఒక వేళ కుప్పం జారిపోతే.. చంద్రబాబు మళ్లీ ప్రెస్‌మీట్‌ పెట్టి.. ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను, పోలీసులను ఆడిపోసుకుంటారనడంలో సందేహంలేదు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనే మాటలు కూడా ఆయన మాట్లాడే అవకాశం లేకపోలేదు. ఓటర్ల తీర్పు ఎలా ఉందో రేపు మధ్యాహ్నం నాటికి తేలిపోతుంది. ఒక వేళ చంద్రబాబు భయపడినట్లు వైసీపీ గెలిస్తే.. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడుగా ఐఏఎస్‌ అధికారి, పైగా వీడియో రికార్డింగ్‌ ఫుటేజీ హైకోర్టుకు అందనుండడంతో.. విమర్శలు, ఆరోపణలు చేసేందుకు టీడీపీకి అవకాశం ఉండబోదు.

Also Read : TDP Chandrababu, Kuppam Elections – కుప్పంలో టీడీపీ ఓడిపోతోందా..? చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు..?