iDreamPost
android-app
ios-app

అమిత్‌ షాను వెంటాడుతున్న ఆ కేసు

అమిత్‌ షాను వెంటాడుతున్న ఆ కేసు

సందర్భానుసారంగా రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల గురించి విమర్శలు చేయడం సర్వసాధారణం. ఒక్కొక్క సారి అవి రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్లిపోతుంటాయి. ఆ సమయంలోనే సదరు విమర్శలు చేసిన నేత చిక్కుల్లో పడతారు. కోర్టు కేసులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పరిస్థితి కూడా ఇలానే ఉంది. త్వరలో పశ్చిమ బెంగాల్‌కు శాసన సభ ఎన్నికలు జరగనునన సమయంలో గతంలో ఆయన తణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీని ఉద్దేశించిన చేసిన విమర్శలు తెరపైకి వచ్చాయి. సదరు ఎంపీ పరువునష్టం దావా వేయడంతో ఈ నెల 22వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక కోర్టు అమిత్‌ షాకు సమన్లు పంపింది.

2018 ఆగస్టులో కోల్‌కతాలో బీజేపీ యువ స్వాభిమాన్‌ సభను నిర్వహించింది. ఆ సభలో పాల్గొన్న అమిత్‌షా తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ అభిషేక్‌ బెనర్జీపై అవినీతి ఆరోపణల వర్షం కురిపించారు. శారద కుంభకోణం, సిండికేట్‌ అవినీతి, మేనళ్లుడి అవినీతి అంటూ మమతా బెనర్జీ వరుసగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘ మోదీ పంపిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయి..? గ్రామీణ వాసులారా.. మీకు వాచ్చాయా..? మోదీ 3.59 లక్షల కోట్లు పంపారు. ఈ డబ్బు ఎటు పోయింది..? ఆ సొమ్ములను మేనళ్లుడికి, సిండికేట్‌కు బహుమతిగా ఇచ్చారు’’ అని అమిత్‌ షా అన్నట్లుగా అభిషేక్‌ బెనర్జీ తాను దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌లో పేర్కొన్నారు.

అమిత్‌ షా ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే అభిషేక్‌ బెనర్జీ పరువు నష్టం దావా వేశారు. 2018 ఆగస్టు 28వ తేదీన దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కోర్టు పలుమార్లు విచారణ జరిపి తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరు కావాలని ప్రత్యేక కోర్టు సమన్లలో పేర్కొంది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు టీఎంసీ ఎంపీకి అనుకూలంగా వస్తే.. అమిత్‌ షాకు చిక్కులు తప్పవు. టీఎంసీ నేతల మాటల దాడిని కూడా అమిత్‌ షా ఎదుర్కొనాల్సి వస్తుంది.