iDreamPost
iDreamPost
ఏపీకి ప్రత్యేక హోదా సాధించని సీఎం జగన్, వైఎస్సార్ సీపీ ఎంపీలకు పదవుల్లో కొనసాగే అర్హతలేదని, రాజీనామా చేయాలని కోరుతున్న టీడీపీ నేతలకు అలా అడిగే అర్హత ఉందా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ కనకమేడల రవీంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం విడివిడిగా మీడియాతో మాట్లాడుతూ రాజీనామా డిమాండ్ చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి నియమించిన సబ్ కమిటీ ఎజెండాలో ప్రత్యేకహోదా చేర్చి మళ్లీ తొలగించటం వైఎస్సార్ సీపీ లోపాయికారీతనం, చేతకానితనానికి నిదర్శనమని అభివర్ణించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కానీ, నైతిక విలువలకు కట్టుబడి కానీ ఒక్కరంటే ఒక్కరు తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడైనా పదవులకు రాజీనామా చేశారా? అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు? 2010లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నైతికతకు కట్టుబడి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన కడప ఎంపీ స్థానానికి జగన్‌మోహన్‌రెడ్డి,, పులివెందుల ఎమ్మెల్యే పదవికి ఆయన తల్లి విజయమ్మ రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంపై నిరసన వ్యక్తం చేస్తూ వీరిద్దరూ 2014లో కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.
అడ్డదారులే తప్ప నైతికత ఏదీ?
టీడీపీని కబ్జా చేసి, ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. తన కుమారుడు లోకేశ్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించే ధైర్యం లేక ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. ఇలా అడ్డదారుల్లో పదవుల్లోకి వచ్చిన వీరు ఎప్పుడూ దానికి అంటిపెట్టుకుని ఉండడమే తప్ప నైతిక విలువలు పాటించలేదని వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తన పబ్లిసిటీ యావ వల్ల గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందినప్పుడు కాని, పోలీసు కాల్పుల్లో విద్యుత్ ఉద్యమకారులు, రైతులు ప్రాణాలు కోల్పోయినప్పుడు కాని సీఎంగా ఉన్న చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. మొన్నటికి మొన్న అసెంబ్లీ మీద అలిగి బయటకు వచ్చేశారే కాని ఎమ్మెల్యే పదవిని మాత్రం అంటిపెట్టుకునే ఉన్నారు. నైతిక బాధ్యత గురించి మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్ అయినా బెయిల్ తెచ్చుకున్నారు తప్ప ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? నీతులు అనేవి ఎదుటివారికి చెప్పడానికే గాని టీడీపీ నేతలకు వర్తించవా? అని వెఎస్సార్ సీపీ నేతలు అడుగుతున్నారు.
కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు..
ప్రత్యేకహాదా ఇస్తానని చెప్పి, ఇచ్చే అధికారం కలిగి ఉన్న బీజేపీని ఎందుకు అడగరు. సబ్ కమిటీ ఎజెండాలో ప్రత్యేకహోదా చేర్చి మళ్లీ తొలగించటం వైఎస్సార్ సీపీ చేతకానితనం అవుతుందా? బీజేపీ నాటకం అవుతుందా? డైరెక్ట్‌గా ప్రధాని మోదీని ప్రశ్నించాల్సింది పోయి ఎంతసేపూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తే ఉపయోగం ఏమిటి? ఈ అంశం ఇంకా సజీవంగా ఉంది అంటే సీఎం జగన్ పట్టువిడువకుండా కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేసిన ఫలితమే. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల వల్లే ప్రత్యేకహోదా రాలేదు అన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించారు. అయినా తమ పద్ధతి మార్చుకోకుండా దిగజారుడు రాజకీయం చేస్తున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో జనం మరింత గట్టిగా బుద్ధి చెబుతారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.
Also Read : వాస్తవాలను వక్రీకరిస్తూ ఇదేం రాజకీయం కేశవ్?