Idream media
Idream media
హైస్కూల్ రోజుల్లో జీవనతరంగాలు సీరియల్ వచ్చేది. వీక్లీలకి బాగా డిమాండ్ ఉన్న కాలం. అన్ని బడ్డి కొట్లలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రిక వీక్లీలు వేలాడుతున్న పీక్ పిరియడ్. మా ఫ్రెండ్ వాళ్ల అక్కయ్య ఆ సీరియల్ చదివి కూచోపెట్ట కథ చెప్పేది. చదివే అలవాటు లేని ఆడవాళ్లు శ్రద్ధగా వినేవాళ్లు. అప్పటికి పిల్లల పుస్తకాలు తప్ప కథలు, నవలలు అలవాటు లేదు. యద్దనపూడి వినిపిస్తూ ఉండడంతో రాయదుర్గం లైబ్రరీలో నల్లులతో కుట్టించుకుంటూ ఈ సీరియల్ చదివాను. ఆసక్తిగా అనిపించింది.
తర్వాత టెన్త్ క్లాస్‌కి అనంతపురం వచ్చాను. రాయదుర్గం కంటే ఇది చాలా పెద్ద లైబ్రరీ, కరవు నేల నుంచి గోదావరి జిల్లాకి వెళ్లినట్టనిపించింది. నవలల సెక్షన్‌కి వెళితే అక్కడున్న క్లర్క్ పిల్లల సెక్షన్ వేరే ఉందన్నాడు. నేను నవలలు చదువుతానంటే ఆశ్చర్యంగా చూసాడు. ట్యూషన్, స్కూల్, హోంవర్క్ ఎన్ని ఉన్నా వీలు చూసుకుని యద్దనపూడి నవలలన్నీ చదివేసాను. పార్థు అన్నిటికంటే బాగా నచ్చేసింది. అలా మొదలైన పుస్తక ప్రయాణం తరిమెల నాగిరెడ్డి లైబ్రరీ నుంచి యూనివర్సిటీకి వెళ్లి జర్నలిజంలో స్థిరపడింది. ఇంకా ఆకలి తీరలేదు, తీరేది కాదు కూడా!
ఇప్పుడు పల్ప్‌లా అనిపిస్తుంది. కానీ యద్దనపూడి నవలల వల్ల విపరీతంగా చదివే అలవాటు వచ్చింది. ఆమె లక్షలాది మంది కొత్త పాఠకుల్ని తయారు చేశారు. అక్కడే ఆగిపోవడమా, ఇంకా ఎదగడమా అనేది అది పాఠకుడి స్థాయిని బట్టి ఉంటుంది. ఎక్కాల పుస్తకం లేకపోతే లెక్కలు రానట్టు, నేరుగా గొప్ప పుస్తకాల్ని ఎవరూ చదవలేదు. టాల్‌స్టాయ్‌ని అర్థం చేసుకోవాలంటే మన మొదటి అడుగు కాలక్షేప సాహిత్యం దగ్గరే ఉండాలి. కొన్ని పుస్తకాలు మన వయసుతోనే ఆగిపోతాయి. చివరికి మిగిలేది నవల వయసుతో పాటు ఎదుగుతూ కొత్తగా అర్థమవుతూ ఉంటుంది.
యద్దనపూడి సులోచనారాణి నవలలు చదవడమే కాదు, ఆమె పరిచయం ఓ మంచి జ్ఞాపకం. ఆంధ్రజ్యోతి మళ్లీ ప్రారంభించినపుడు యద్దనపూడి డైలీ సీరియల్ వేయాలని యాజమాన్యం నిర్ణయించింది. యద్దనపూడి ఇంటికెళ్లి సీరియల్ కాగితాల్ని తీసుకొచ్చే బాధ్యత నాది. పంజాగుట్టలో నిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న రోడ్డులో ఇల్లు. పాతకాలం సాధారణమైన ఇల్లు. చిన్న కాంపౌండ్, పూల మొక్కలు. అట్టహాసంగా లేదు కానీ అందంగా ఉంది. బెల్ కొడితే ఆవిడ భర్త తలుపు తీసారు. పూజ నుంచి వచ్చినట్టున్నారు. ఆంధ్రజ్యోతి నుంచి వచ్చానంటే కూచోమని కొబ్బరి ముక్క ప్రసాదంగా పెట్టారు.
ఐదు నిమిషాల తర్వాత సులోచనారాణి వచ్చారు. సన్నగా సుకుమారంగా ఉన్నారు. అప్పటికే 60 పైన వయసున్న , 40 దాటనట్టున్నారు. కళ్లలో ప్రశాంతత, దయ. దండం పెట్టాలనిపించేంత బాగున్నారు. నన్ను చూసి చిరునవ్వు నవ్వి “వసంతలక్ష్మి గారు చెప్పారు మీరొస్తారని” అన్నారు (వసంతలక్ష్మి ఫీచర్స్ ఎడిటర్. కష్టకాలంలో ఉద్యోగం ఇప్పించిన మా అక్కయ్య).
ఒక కాగితాల బొత్తి ఇచ్చారు. చిన్న పిల్లల రాతలా ఉంది. కొట్టివేతలు లేకుండా శుభ్రంగా ఉంది. చిన్నప్పటి నుంచి విన్న పేరు, తెలిసిన అక్షరాలు. ఆనందమేసింది. నేను కథలు రాస్తానంటే సంతోషించారు. “రాయడం ఒక అలవాటు, రెగ్యులర్‌గా రాస్తూ వుండాలి” అన్నారు. తర్వాత ఐదుసార్లు వెళ్లాను. ఏమైనా రాస్తున్నారా అని అడిగేవారు. లేదంటే, ఆగితే మళ్లీ రాయలేరు అని హెచ్చరించారు.
చివరిగా చెక్ ఇవ్వడానికి వెళ్లాను. రూ.50 వేలు ఇచ్చినట్టు గుర్తు. ఆనందంగా చూసుకున్నారు. “ఆంధ్రజ్యోతి అంటే నాకూ చాలా ఇష్టం. ఆ సంస్థ నుంచి వచ్చిన చెక్ కదా అదీ ఆనందం” అన్నారు. ఆమెకి ఎండీ , ఎడిటర్లు తెలుసు. నేనో సాధారణ సబ్ ఎడిటర్ అని నన్ను అంతగా గౌరవించాల్సిన పనిలేదు. కానీ కూచోపెట్టి కాసేపు సాహిత్యం గురించి మాట్లాడి కాఫీ ఇచ్చి పంపేవాళ్లు. అది ఆమె మంచితనం. అందుకే ఆమె కథల్లో విలన్లుండరు. ఆ రోజుల్లో సెల్ కెమెరాలు లేవు. ఉంటే ఒక ఫొటో మిగిలేది. ఆవిడని ఇంటర్వ్యూ చేయాలనే ఆలోచన కూడా రాలేదు. మూర్ఖున్ని. ఇదంతా జరిగి దాదాపు 19 ఏళ్లైంది. కానీ నిన్నమొన్న జరిగినట్టుంది.
మూడేళ్ల క్రితం కాలిఫోర్నియా స్టేట్‌లోని క్యుపర్టినో సిటీలో ఆమె పోయారు. హార్ట్ ఎటాక్‌తో ఆస్పత్రిలో చనిపోయారు. అక్కడున్న తెలుగు వాళ్లకి కూడా విషయం ఆలస్యంగా తెలిసి అంత్యక్రియలకి వెళ్లలేక పోయారు. అక్షరాల్లో ఆమె జీవించే వుంటారు.
(ఏప్రిల్ 2 సులోచనారాణి పుట్టిన రోజు, కొంచెం ఆలస్యంగా గుర్తొచ్చి)