చంద్రునిపై చెరగని ముద్ర వేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెడీ అయింది. ఈ అంతరిక్ష ప్రయోగం మన కీర్తి ప్రతిష్ఠల్ని ప్రపంచంలో మరింత పెంచనుంది. స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత పెంచే చంద్రయాన్-3 కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. అమెరికా, చైనా, రష్యాలకు భిన్నంగా భారత్ చంద్రుడిపైకి భిన్నమైన దారిలో భారత్ వెళ్లనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరికి తెలియని నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు చంద్రయాన్-3 ప్రయోగాన్ని శుక్రవారం చేపట్టనుంది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే ఈ ప్రయోగంలో మన హైదరాబాద్ మార్క్ కూడా ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చంద్రయాన్-3.. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు.. 140 కోట్ల భారతీయుల ఎమోషన్, కల. నాలుగేళ్ల క్రితం చేసిన ప్రయోగం విఫలమవ్వడంతో.. భారతీయులు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. చంద్రయాన్-3 ద్వారా మరోసారి జాబిల్లిపైకి వెళ్లేందుకు సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగం జరనుంది. బాహుబలి రాకెట్ గా గుర్తింపు పొందిన MLV-3 M-4.. చంద్రయాన్-3 మోసుకెళ్లనుంది. అయితే చంద్రయాన్ 3 కోసం వినియోగించే రాకెట్ లోకి మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణా లోనే కొన్ని విడిభాగాలను తయారు చేయించి వినియోగించారు.
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో ఈ విడి భాగాలను తయారు చేయించారు. ప్రశాంత్ నగర్ లోని నాగసాయి ప్రెసెసియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చంద్రయాన్-3లో వినియోగించే కొన్ని విడి పరికాలను తయారు చేసింది. రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్‌లో బ్యాటరీలు ఏర్పాటు చేసుకునే విడి భాగాలను హైదరాబాద్ లోనే తయారు చేశారు. నాగసాయి ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ డీఎన్ రెడ్డి 1998 నుంచి ఇస్రో ప్రయోగించిన 50శాటిలైట్లలో పలు విడి భాగాలు అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం చంద్రయాన్ 3 కి కూడా ఆయనే పలు విడిభాగాలను అందించారు. మరి.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ చంద్రయాన్-3 ప్రయోగంలో హైదరాబాద్ మార్క్ ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.