iDreamPost
iDreamPost
బ్యాటింగ్.. బౌలింగ్‌లలో వైఫల్యాలతో టెస్టు సిరీస్‌ను చేజేతులా కోల్పోయిన భారత జట్టు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. తొలి వన్డేలో కూడా అటు బౌలింగ్ లోనూ .. ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమై పరాజయాన్ని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్‌మెన్‌లు వాండర్ డసేన్, బవుమాలు సెంచరీలు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు ఏకంగా 297 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భారత్ బ్యాట్స్‌మెన్‌లు విఫలం కావడంతో తొలి వన్డేను దక్షిణాఫ్రికా జట్టు 31 పరుగుల తేడాతో గెలుచుకుంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఇక్కడ బోలాండ్ పార్కులో బుధవారం జరిగింది. 297 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 265 పరుగులు మాత్రమే చేసింది. భారత జట్టులో శిఖర్ ధావన్ 79 పరుగులు చేయగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 51 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి రెండవ వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఆడుతున్న సమయంలో జట్టు విజయంపై కొంత ఆశలు చిగురించాయి. అయితే జట్టు స్కోర్ 138 వద్ద ధావన్, 152 వద్ద కోహ్లీలు వెనుదిరగడంతో భారత్ ఓటమి ఖరారయ్యింది. వీరిద్దరూ మినహా మిగిలినవారు పెద్దగా రాణించలేదు. కెప్టెన్ కె.ఎల్.రాహూల్ 12, పంత్ 16, లయర్ 2, అశ్విన్ 7, కుమారు 4 పరుగులకే ఔటయ్యారు. చివరిలో ఠాకూర్ 43 బంతుల్లో 50 పరుగుల (ఐదు ఫోర్లు, ఒక సిక్స్)తో మెరుపులు మెరిపించినా ఫలితం దక్కలేదు. అతనికి బుమ్రా 14 పరుగులతో అండగా నిలిచాడు. వీరిద్దరూ ఎనిమిదవ వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లు వాండర్ డసెస్ వీరవిహారానికి తోడు… బవుమా తోడు కావడంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించింది. నాల్గవ వికెట్‌కు వీరిద్దరూ ఏకంగా 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వాండర్ డెసేన్ కేవలం 96 బంతుల్లో ఏకంగా 129 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉండడం విశేషం. బవుమా సైతం 110 పరుగులు (8×4) చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. భారత్ జట్టులో బుమ్రా రెండు వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. వికెట్లు తీయడంలో ప్రధాన బౌలర్లు విఫలంకావడంతో పాటు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
Also Read : చేజేతులా…. ఓటమి కొనితెచ్చుకున్న భారత్ సిరీస్ సఫారీల వశం