Idream media
Idream media
కరోనా మహమ్మారి ప్రపంచానికి పరిచయం చేసిన హీరో సోనూ సూద్. వైరస్ కట్టడిలో, పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విజయవంతమయ్యాయా, లేదా అనేది పక్కనబెడితే, సేవా కార్యక్రమాల్లో మాత్రం సోనూ అందరి దృష్టినీ ఆకర్షించారు. సినిమాల పరంగా విలన్ గా కనిపించినప్పటికీ నిజజీవితంలో ఎందరో పేదలను ఆదుకుని హీరోగా మారారు. మహమ్మారి విజృంభణ సమయంలో అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నా అనే అభయం కల్పిస్తూ ఎంతోమందికి సహాయంగా నిలిచారు. ఇంకా నిలుస్తూనే ఉన్నారు. ఏ అవసరం ఉన్నా కూడా అన్నా అని పిలిస్తే వారి సమస్య తీరుస్తున్నాడు.
కరోనా విజృంభణతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండానే తానే ఓ నాయకుడిగా మారారు సోనూసూద్. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఆ మాటకొస్తే అంతకు మించే పేదలకు చేరువయ్యాడు. కరోనా సమయంలో ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వానికి చెప్పాలనే ఆలోచన పోయి సోనూసూద్ కి చెప్తే ఆ సమస్య తీరిపోతుంది అనే నమ్మకం కలిగించాడు. అంటే అయన చేసిన సేవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బస్సులు విమానాలు రైళ్లలో వలస కూలీలని తరలించి వారందరికీ దేవుడిగా మారాడు. ఆక్సీజన్ అవసరం అయిన సమయంలో అడిగిన పది నిముషాల్లోనే సిలిండర్ ఏర్పాటు చేసి దానం చేయడంలో కర్ణుడిని మించిపోయాడు. ఇప్పటికి ఆ కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే .. ఎన్నో మంచి పనులు చేసిన సోనూసూద్ తాజాగా మరో బృహత్కరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కవర్ జి పేరుతో సరికొత్త కార్యక్రమానికి తీసుకురాబోతున్నాడు. గ్రామీణ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్న అపొహల్ని తొలగించటమే ‘కవర్ జి’ లక్ష్యం. ఎక్కడి కక్కడ వాలంటీర్స్ ని తయారు చేసి ఊళ్లలోని అన్ని వర్గాల వారికి కరోనా మహమ్మారి ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఆసక్తి కలవారు సేవా భావం ఉన్న వారు ఎవరైనా ముందుకు రావచ్చని సోనూసూద్ ఓ పిలుపునిచ్చారు. ‘కవర్ జి’ పేరుతో సూద్ ప్రాంభించిన వెబ్ సైట్ లో ఆసక్తి కలవారు రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత వ్యాక్సిన్ కు సంబంధించిన సమస్త సమాచారంతో కూడుకున్న శిక్షణని రిజిస్టర్డ్ వాలెంటీర్స్ కు అందిస్తారు. ఇక వారు తమ తమ పరిధుల్లో సామాన్య జనానికి వ్యాక్సిన్ గురించిన అవగాహన చైతన్యం కలిగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కవర్ జి ద్వారా సోనూ సూద్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా ఎక్కువుగా జరిగేలా చేయాలని అనుకుంటున్నారు. ఆన్ లైన్ లో సోనూ ప్రారంభించిన ‘కవర్ జి’ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి కూడా ఉందని చెబుతున్నారు. అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్ విభాగంలో ‘కవర్ జి’కి దిల్లీ నుంచీ అమోదం లభించింది. దీని ద్వారా సోనూసూద్ గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి మరింతగా చేరువ కానున్నాడు.