iDreamPost
android-app
ios-app

సోనియా గాంధీ మమతాల కలయిక ప్రతిపక్షాలను ఏకం చేస్తుందా?

సోనియా గాంధీ మమతాల కలయిక ప్రతిపక్షాలను ఏకం చేస్తుందా?

ప‌శ్చిమ బెంగాల్ లో బీజేపీని చిత్తు చేసిన ముఖ్య‌మంత్రి బెన‌ర్జీ దేశంలో ఆ పార్టీని చిత్తుచేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఇప్ప‌టి వ‌ర‌కు స‌భ‌లు, స‌మావేశాల వేదిక‌గా సంకేతాలు పంపిన దీదీ నేరుగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ స‌హా విప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిలో ఢిల్లీలో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్టడమే ప‌నిగా పావులు క‌దుపుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మునుపటి బలం కోల్పోతున్న వేళ మమతా బెనర్జీ ఆ పార్టీని బలోపేతం చేసేలా వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీని ప‌డ‌గొట్ట‌డమే క‌ర్త‌వ్యం కానీ, దేశానికి నాయ‌క‌త్వం వ‌హించాల‌న్న ఆలోచ‌న లేద‌ని ఢిల్లీ కేంద్రంగా మ‌మ‌త స్ప‌ష్టం చేయ‌డం కాంగ్రెస్ లో ఉత్సాహం రేకెత్తిస్తోంది.

2023 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం.. దేశంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడమే ఎజెండాగా మమతా బెనర్జీ రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది. కానీ జాతీయ స్థాయిలో బీజేపీని ఎదురించి ఎదగలేకపోతోంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దూరం పెట్టకుండా ఆ పార్టీని కలుపుకు పోయే ఎత్తుగడను మమతా బెనర్జీ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ తాజాగా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని కలిశారు.

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఓ ప్రత్యామ్నాయ కూటమికి మమత ప్రయత్నిస్తున్న‌ట్లు తాజాగా స్ప‌ష్ట‌మైంది. అందులో భాగంగానే ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీలో బీజేపీ కి వ్య‌తిరేకంగా కొత్త ఫ్రంట్ కు సోనియా గాంధీ కూడా సుముఖత వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే, అందుకు కాంగ్రెస్ కొన్ని ష‌ర‌తులు విధించింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. పెద్ద‌న్న పాత్ర త‌మ పార్టీయే పోషించాల‌న్న కోరిక ఆమె ముందు ఉంచిన‌ట్లు తెలుస్తోంది. బీజేపీని ఢీ కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న మ‌మ‌త అందుకు సానుకూలం వ్య‌క్తం చేసిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు ఆమె చేసిన వ్యాఖ్య‌లు కూడా బ‌లం చేకూరుస్తున్నాయి.

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేసి వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన దీదీ .. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవ‌డ‌మే ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్ర‌ధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె బుధవారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో భేటీలో రాహుల్ గాంధీ కూడా ఉండ‌డంతో బీజేపీ వ్య‌తిరేక రాజ‌కీయ వేదిక కోస‌మే మ‌మ‌త వారిని క‌లిసింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ పీఠంపై మ‌మ‌త క‌న్నేశార‌ని భావించ‌గా, తాను నాయ‌క‌త్వం వ‌హించాల‌ని అనుకోవ‌డం లేద‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సోనియాతో భేటీ అనంత‌రం మ‌మ‌త మాట్లాడుతూ.. ‘‘పిల్లి మెడలో గంట కట్టే విషయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటికీ సాయం చేయాలనుకుంటున్నాను. నేను నాయకత్వం వహించాలనుకోవడం లేదు. ఒక కార్యకర్తగా ఉంటాను. ఎవరు నేతృత్వం వహించినా నాకేమీ అభ్యంతరం లేదు. ఆ అంశం చర్చకు వచ్చినప్పుడే నిర్ణయిస్తాం. నేనేమీ పట్టుబట్టను’’ అని చెప్ప‌డంతో కాంగ్రెస్ అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

పార్ల‌మెంట్ స‌మావేశాల అనంత‌రం మ‌మ‌త త‌న ల‌క్ష్యా సాధ‌న‌కు మ‌రోసారి అంద‌రినీ క‌ల‌వ‌నున్నారు. ప్రతిపక్షాల ఏకీకృతంపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల అనంతరం చర్చలు ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పేశారు. ఏకీకృత ప్రతిపక్షం ఉండాలని సోనియాగాంధీ కూడా కోరుకుంటున్నారన్నారు. బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ఏకైక ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న మ‌మ‌త ఆ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తుండ‌డం జాతీయ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.