సోనాలి బింద్రే… తెలుగులో ఈ పేరుకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. 2000 సంవత్సరం నుంచి దాదాపు పదేళ్ళ పాటు తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పటి కుర్రకారులో సోనాలికి ఉన్న ఫాలోయింగే వేరు. ముఖ్యంగా మురారి సినిమాతో ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అయితే సోనాలి ఒక క్లిష్ట సమయంలో తాను పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
కొన్ని సినిమాలు అనివార్య కారణాల వల్ల ఒప్పుకోవాల్సి వస్తుంది. వాటి ఫలితం ఎలా ఉన్నా, అప్పటి పరిస్థితులు అలా ముందుకు నెడతాయి. సరిగ్గా అలాంటి కారణమే చెప్పుకొచ్చింది సోనాలి. ఒక సమయంలో తాను చాలా గడ్డు సందర్భాల్ని ఎదుర్కొన్నట్లుగా పేర్కొంది. ఆర్థికంగా అవసరాలు ఉండటంతో తన వరకు వచ్చిన ప్రతి పాత్రను మరో ఆలోచన లేకుండా చేసేసిందట. అలా తరువాతి సినిమాకు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసిన రోజుల గురించి చెప్పుకొచ్చింది సోనాలి.
కొన్ని సినిమాలు అసలు ఎందుకు ఒప్పుకున్నాను? అని ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయని చెప్పింది. అద్దెలు, ఇతర బిల్లులు చెల్లించాల్సి రావడం వల్లే అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పేసుకుందట ఈ భామ. కానీ ఆ సినిమాలను ప్రేక్షకులే కాదు, తాను కూడా చూడలేదని చమత్కరించింది.
2013 తరువాత వెండితెరకు కాస్త బ్రేక్ ఇచ్చింది సోనాలి. మరోవైపు తనకు క్యాన్సర్ సోకినా ధైర్యంగా పోరాడి ఆ మహమ్మారిపై గెలిచి చాలామందికి స్ఫూర్తినిచ్చింది. మురారి, ఖడ్గం, మన్మథుడు, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సూపర్ హిట్ తెలుగు చిత్రాల్లో నటించింది సోనాలి.