iDreamPost
android-app
ios-app

సోము ఉన్నంత వ‌ర‌కూ బాబుకు ఆ చాన్స్ లేన‌ట్లే..!

సోము ఉన్నంత వ‌ర‌కూ బాబుకు ఆ చాన్స్ లేన‌ట్లే..!

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ద‌గ్గర‌య్యేందుకు ప‌రోక్షంగా చంద్ర‌బాబునాయుడు చాలా ప్ర‌య‌త్నాలే చేశారు. గ‌తంలో మోదీకి వ్య‌తిరేకంగా ఎన్నో వ్యాఖ్య‌లు, వంగ్యాస్ర్తాలు విరిసిన ఆయ‌న ఈ రెండేళ్ల‌లో ప‌లు మార్లు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. యుద్ధ విమానాల కొనుగోళ్లు, రాజ‌ధాని అంశాల్లో మోదీని తిట్టిన నోటితోనే ప్ర‌శంసించారు.

ప్రధాని .@narendramodi 
ఏ ముఖంపెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారు? విభజన గాయం మీద కారం చల్లేందుకా..? లేక రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసి మభ్యపెట్టేందుకా..? అంటూ ట్వీట్లు చేసిన చంద్ర‌బాబు.. మోదీజీ ఏపీ అంశాల్లో జోక్యం చేసుకుని మీరే ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దాలంటూ విన్న‌వించిన సంద‌ర్భాలూ ఉన్నాయి. చంద్ర‌బాబు మోదీని పొగిడిన‌ప్పుడ‌ల్లా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు రంగ ప్ర‌వేశం చేసి, గ‌తంలో ఆయ‌న వేసిన విసుర్లు తెర‌పైకి తెచ్చి బాబును ఇర‌కాటంలో ప‌డేసేవారు.

బీజేపీతో క‌లిసేందుకు ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌రోక్షంగా ప్ర‌య‌త్నించిన చంద్ర‌బాబు నాయుడు మ‌హానాడు వేదిక‌గా బీజేపీ ప్ర‌భుత్వానికి ప్ర‌త్య‌క్షంగానే మ‌ద్దతు ప‌లికారు. క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్న‌మాన్న సంకేతాలు ఇచ్చారు. టీడీపీతో క‌లిసేందుకు సిద్ధంగా లేమ‌ని ఇప్ప‌టికే ప‌లువురు బీజేపీ నేత‌లు ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీలోని ఓ వ‌ర్గం, బాబు న‌మ్మిన‌బంట్లుగా పేరొందిన ప‌లువురు నాయ‌కులు చంద్ర‌బాబు అభిమ‌తాన్ని బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌ దృష్టికి తీసుకెళ్లాల‌ని తెగ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. కానీ, రాష్ట్ర బీజేపీకి సోము వీర్రాజు అధ్య‌క్షుడిగా ఉండ‌గా చంద్ర‌బాబు ఆశ‌లు నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు చంద్ర‌బాబు చేస్తున్న త‌ప్పుల‌ను ఎత్తిచూపుతున్న సోము తాజా ప‌రిణామాల‌పై కూడా స్పందించారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన మోదీ రెండోసారి ప్రధాని కాకూడదని కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపి బీసీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని మ‌రోసారి విమ‌ర్శ‌లు చేశారు సోము వీర్రాజు. మోదీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడలో సోము పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఊళ్లో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావుడి అన్నట్టు, ఇప్పుడు కేంద్రానికి మద్దతిస్తానని బాబు నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ రెండింటికీ తాము సమదూరంగా ఉంటామన్నారు. అంటే బాబుతో బీజేపీ క‌లిసేది క‌ల్లే అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. మ‌రి బాబు కోసం బీజేపీలో ప‌ని చేస్తున్న కొంత మంది బ‌డా నేత‌లు త‌మ ప్ర‌య‌త్నాలు ఎలా కొన‌సాగిస్తారో వేచి చూడాలి.