Idream media
Idream media
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఇటీవల బిడ్లను కూడా ఆహ్వానించింది. ఆన్ లైన్ లో సంబంధిత అప్లికేషన్లను కూడా అందుబాటులో ఉంచింది. దీంతో ఉక్కు కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేశారు.
ఇటీవలే భారీ ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టిన కార్మికులు ఇకపై ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 2, 3 తేదీల్లో 3వేల మంది కార్మికులతో ‘చలో పార్లమెంట్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్లాంట్ పరిరక్షణ కమిటీ పేర్కొంది. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
కాగా, ప్లాంట్ ను కాపాడడానికి కార్మికులతో పాటు రాజకీయ పక్షాలు కూడా ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. అధికార వైసీపీ కూడా విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదాన్ని, అవసరాన్ని కేంద్రానికి వివరిస్తోంది. ఇదిలా ఉండగా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకాకుండా రాష్ట్రంలో ఉన్న బీజేపీ చూస్తుందట. ఓ వైపు స్టీల్ ప్లాంట్ విక్రయానికి ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. 7వ తేదీ నుంచి టెండర్లను సైతం కేంద్రం ఆహ్వానిస్తూ ఉత్తర్వులు సైతం జారీచేసింది. 28వ తేదీ వరకు బిడ్ సమర్పణకు చివరి తేదీగా కూడా నిర్ణయించింది. 29వ తేదీన సాంకేతిక బిడ్లను ప్రకటిస్తామని కూడా ప్రకటించింది. టెండర్లలో ఎంపికైన కంపెనీకి తక్షణమే స్టీల్ ప్లాంట్ అప్పగించేందుకు కూడా చర్యలు చేపడుతోంది.
స్టీల్ ప్లాంట్ అమ్మేసే ప్రక్రియ ఇంతవేగంగా కొనసాగుతున్నప్పటికీ.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపుతామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ప్రకటిస్తుండడం గమనార్హం. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని బలంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. నిజంగా చిత్తశుద్ధితోనే చెప్పారో, లేదా ఏదో ఫ్లోలో అన్నారో కానీ సోము వ్యాఖ్యలు కార్మికులకు కాస్త భరోసాను కలిగిస్తాయనడం వాస్తవం.
విచిత్రమేమంటే.. సుమారు 150 రోజులుగా ఏపీ బీజేపీ నుంచి ఇంత స్పష్టంగా హామీ రాలేదు. టెండర్లు ప్రకటించి, దానికి చివర తేదీ కూడా చెప్పి, ఎంపికైన కంపెనీకి ప్లాంట్ అప్పగించేస్తామని కుండబద్దలు కొట్టినట్లు కేంద్రం నిర్ణయం తీసుకున్నాక, ఏపీ బీజేపీ నుంచి ఇటువంటి హామీ రావడం నిజంగా ఆశ్చర్యకరమే. పైగా ఇదే సమయంలో ఆయన పోరాటం చేస్తున్నవారిపైన కూడా విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న నాయకులు.. డెయిరీలు స్పిన్నింగ్ మిల్లులు షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ చేసినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఒకేసారి రెండు విధాలుగా మాట్లాడడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఏపీ బీజేపీ ఆపగలిగితే అది రాష్ట్రానికే కాకుండా ఆ పార్టీ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఏపీలో బలపడాలని తపన పడుతున్న బీజేపీకి స్టీల్ ప్లాంట్ ఓ బాట వేస్తుంది. కానీ, నష్టాల పేరిట దేశ వ్యాప్తంగా చాలా పరిశ్రమలను విక్రయానికి పెట్టిన కేంద్రం.. ఏపీ బీజేపీ మాట వింటుందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతుందా? అంటే చెప్పడం కష్టమే..!