iDreamPost
android-app
ios-app

బీజేపీ ఆ పని చేస్తే.. వైసీపీ వాళ్లకు అన్నీ తడిసిపోతాయంట..!

బీజేపీ ఆ పని చేస్తే.. వైసీపీ వాళ్లకు అన్నీ తడిసిపోతాయంట..!

ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లున్నారు. ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నారో లేక.. దూకుడుగా వెళ్లాలని అనుకుంటున్నారో గానీ.. పదే పదే ఆయన పప్పులో కాలేస్తున్నారు. అధికార పార్టీని టార్గెట్‌ చేయాలని ప్రయత్నిస్తూ.. తానే టార్గెట్‌ అవుతున్నారు. పేర్లు మార్పు రాజకీయాలు చేస్తున్న సోము.. తాజాగా మరో అంశాన్ని ప్రస్తావించారు. జగనన్న కాలనీలను మోదీ కాలనీలుగా మారుస్తామని ప్రకటించారు. ఎవరు అడ్డు వస్తారో చూస్తామంటూ కన్నెర్రజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని, సోము వీర్రాజు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఆ పథకాలకు తమ బొమ్మలు వేస్తే.. వైసీపీ వారికి అన్నీ తడిసిపోతాయంటూ వ్యాఖ్యానించారు.

లాజిక్‌ లేకుండా ఇలాంటి ప్రకటనలు, ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం వల్లనే పదే పదే సోము వీర్రాజు ప్రత్యర్థులకు లక్ష్యంగా మారుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సర్కార్‌.. ఇళ్లులేని ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తలపెట్టింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని.. దాదాపు 33 లక్షల మందికి సెంటు, సెంటున్నర చొప్పన ఇళ్ల స్థలాలు ఇచ్చింది. తొలి విడతగా దాదాపు 15 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తలపెట్టి.. పనులు చేస్తోంది. వాటికి జగనన్న కాలనీలుగా నామకరణం చేసింది. సోము చెప్పినట్లు.. ఈ 33 లక్షల ఇళ్ల స్థలాలు కేంద్ర ప్రభుత్వ పథకమే అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఈ తరహా పథకం అమలు జరిగి ఉండాలి కదా..? అనే ప్రశ్న సామాన్యుడిలోనూ కలుగుతుంది. మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. ఈ ఎనిమిదేళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒకే సారి 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు చూపించాలని అడిగే పరిస్థితి సోము వీర్రాజు తెచ్చుకున్నారు.

సోము వీర్రాజు చెప్పిందే నిజమైతే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంచి అస్త్రం దొరికినట్లే. కేసీఆర్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించిన బండి సంజయ్‌.. వివిధ అంశాలపై పోరాటం చేస్తున్నారు. ఉద్యోగులు బదిలీల విషయంలో జైలుకు కూడా వెళ్లారు. కేసీఆర్‌ అవినీతిపరుడంటూ ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి బండి సంజయ్‌.. ఏపీలో కేంద్ర ప్రభుత్వం పథకానికి పేరు మార్చి జగనన్న కాలనీలు అంటూ 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు..? అని కేసీఆర్‌ను నిలదీసేందుకు అవకాశం దొరికినట్లే. పేరు ఏదైనా ఏపీలో అమలైన కేంద్ర ప్రభుత్వం పథకం.. తెలంగాణలో ఎందుకు అమలు చేయలేదని కేసీఆర్‌ను బండి సంజయ్‌ ప్రశ్నించవచ్చు. అలా చేయడం ద్వారా పేదల్లో బీజేపీకి ఎక్కడ లేని ఆదరణ లభిస్తుంది. మరి బండి సంజయ్‌కు.. సోము చేసిన ఈ ప్రకటన చేరుతుందో..? లేదో..?

Also Read : నేను ప్రధాని అయ్యాకే ఇదంతా : మణిపూర్‌లో మోడీ కీలక వ్యాఖ్యలు