iDreamPost
android-app
ios-app

సోము వీర్రాజు త్వ‌ర‌లో మాజీ..!

సోము వీర్రాజు త్వ‌ర‌లో మాజీ..!

ఏపీ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన‌ప్ప‌టి నుంచి రాష్ట్రంలో బీజేపీ బలపడటమే లక్ష్యంగా సోము వీర్రాజు విశేషంగా కృషి చేస్తున్నారు. టీడీపీని వెన‌క్కి నెట్టి, వైఎస్సార్సీపీకి తామే ప్రత్యామ్నాయం అని చాటేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తూ హ‌డావిడి చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస ఎన్నిక‌ల అనంత‌రం కాస్త స్లో అయ్యారు. త్వ‌ర‌లో ఆయ‌న త‌న ప‌ద‌విని కోల్పోనున్నారు. అధ్య‌క్షుడి ప‌ద‌వి కాదండోయ్..! మ‌రిచిపోయారా ఆయ‌న ఎమ్మెల్సీ కూడా. సోము అన‌గానే చాలా మందికి బీజేపీ అధ్య‌క్షుడు అనే పేరే తెలుసు. ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియా క‌థ‌నాల్లో కూడా బీజేపీ ఏపీ అధ్య‌క్షుడిగానే పేర్కొంటారు త‌ప్పా, ఎమ్మెల్సీ అని సాధార‌ణంగా ఎక్క‌డా వాడ‌రు. కానీ ఆయ‌న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. త్వ‌ర‌లో ఆయ‌న ప‌ద‌వీకాలం ముగియ‌నుంది.

2014 సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయినప్పటికీ.. టీడీపీ మద్దతుతో ఎమ్మెల్యే కోటాలో సోమూ వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారు. 2015లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మే 31తో ఆయన పదవీకాలం ముగుస్తోంది. సోము వీర్రాజుతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా ముగుస్తోంది. వారిలో టీడీపీ సభ్యుడు.. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మొహద్ అహ్మద్ షరీఫ్ వైసీపీ సభ్యుడు దేవసాని చిన్న గోవింద్ రెడ్డి ఉన్నారు. వీరు కూడా మే 31 తర్వాత మాజీ ఎమ్మెల్సీలు కానున్నారు.

అయితే.. మండలి చైర్మన్ షరీఫ్ పదవీకాల ముగియడం అధికార పార్టీకి ఊరట కలిగించే అంశం కానుంది. కౌన్సిల్లో మూడు రాజధానుల బిల్లులు ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లును ఆమోదించడానికి పలు అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఇలా చేశారనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. అందువల్ల.. ఆయన మండలి నుంచి వెళ్లిపోవడం వైసీపీ పెద్ద ఉపశమనమేనని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ మూడు స్థానాలకు త్వరలో ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో భారీ సంఖ్యా బలం కలిగిన వైసీపీ.. ఈ మూడు స్థానాలను తేలిగ్గా గెలుచుకోనుంది. తెలంగాణలోనూ పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. వీరిలో శాసనమండలి చైర్మన్ గుతా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కడియం శ్రీహరి అకుల లలిత బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరంతా అధికార టీఆర్ఎస్ సభ్యులే కావడం గమనార్హం.