Idream media
Idream media
సోము వీర్రాజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా ఎన్నికై ఏడాదిన్నర అవుతోంది. ఏపీలో సొంతంగా ఎదగాలని, ఉనికి చాటుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అగ్రనాయకత్వం ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, కరుడుగట్టిన బీజేపీ వాది అయిన సోమును అధ్యక్ష పీఠంపై కూర్చోపెట్టింది. శక్తి వంచనలేకుండా సోము వీర్రాజు పని చేసినా.. ఫలితం మాత్రం నామమాత్రమే. బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని.. స్థానిక ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ, బద్వేలు ఉప ఎన్నికల్లో తేలిపోయింది.
హిందుత్వ అజెండాను ఎత్తుకున్నా.. ఏపీలో బీజేపీకి అంత సీను లేదని తేలిపోయిందనుకుంటున్న తరుణంలో లిక్కర్ వ్యవహారాన్ని సోము వీర్రాజు ఏ లక్ష్యంతో ఎత్తుకున్నాడో గానీ దాని వల్ల బీజేపీకి అంతో ఇంతో మేలే జరిగింది. మంచో, చెడో, లాభమో, నష్టమో.. బీజేపీ గురించి ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చీఫ్ లిక్కర్ క్వార్టర్ 75 రూపాయలకు ఇస్తామని, ఆదాయం బాగుంటే 50 రూపాయలకే ఇస్తామని సోము వీర్రాజు ఇటీవల చెబుతున్నారు. నిన్న జరిగిన ప్రజాగ్రహ సభ తర్వాత ఈ అంశం ప్రజల్లోకి వేగంగా వెళ్లింది. సోషల్ మీడియాలో సోము వీర్రాజుపై సెటైర్లు పడుతున్నాయి. సారాయి వీర్రాజు.. సోము బీర్రాజు.. అంటూ సోషల్ మీడియా సోము వీర్రాజుకు సరికొత్త పేరు పెట్టి ట్రోల్ చేస్తోంది.
అదే సమయంలో కేటీఆర్ కూడా.. సోము వీర్రాజుపై సెటైర్లు వేశారు. ‘‘వావ్ ఏమి పథకం..? ఎంత అవమానకరం..? ఏపీలో చీఫ్ లిక్కర్ 50 రూపాయలకు ఇవ్వాలనేది బీజేపీ జాతీయ విధానమా..? లేక నిరాశ ‘అధికం’గా ఉన్న రాష్ట్రాలకు కూడానా.?’’ అంటూ కేటీఆర్ వ్యంగ్యోక్తులు విసిరారు. సోము వీర్రాజు మాట్లాడుతున్న వీడియోను ట్యాగ్ చేసిన కేటీఆర్.. పరోక్షంగా తెలంగాణ బీజేపీ నేతలకు కూడా చురకలు అంటించారు. తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ కూడా చీఫ్ లిక్కర్‌ను 50 రూపాయలకే ఇస్తామనే హామీని బీజేపీ నేతలు ఇస్తారా..? అనే అర్థం వచ్చేలా.. ‘ నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు కూడానా..?’ అంటూ వ్యాఖ్యానించారు.
ఏదిఏమైనా ఏపీలో అధికారంలోకి వస్తామనే ప్రకటలు చేస్తున్న సోము వీర్రాజు.. ఆ లక్ష్యం చేరుకున్నా..? చేరుకోకపోయినా..? బీజేపీ గురించి తెలుగు రాష్ట్రాలలో మాట్లాడుకునేలా చేయడంలో ఊహించని విధంగా సఫలమయ్యారు.
Also Read : బీజేపీని చూస్తే పాపమనిపిస్తోంది.. సజ్జల సెటైర్లు