iDreamPost
android-app
ios-app

రూట్‌మ్యాపే కాదు.. ఫ్లాట్‌ఫాం కూడా సిద్ధం చేస్తున్న బీజేపీ

రూట్‌మ్యాపే కాదు.. ఫ్లాట్‌ఫాం కూడా సిద్ధం చేస్తున్న బీజేపీ

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి అధికారం సాధిస్తామంటూ బీజేపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాకముందు వరకూ పొత్తు ఉన్నా బీజేపీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న జనసేన అధినేత.. ఫలితాల తర్వాత బీజేపీ పట్ల ఓ క్లారిటీకి వచ్చారు. 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతామని పార్టీ ఆవిర్భావ సభలో స్పష్టంగా ప్రకటించారు. బీజేపీ నేతలను రూట్‌ మ్యాప్‌ అడిగామని, వారు ఇచ్చే రూట్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నామంటూ మాట్లాడి.. బీజేపీ పట్ల తన విధేయతను, విశ్వాసాన్ని చాటుకున్నారు. ఈ పరిణామం తర్వాత ఏపీ బీజేపీ నేతలు స్పీడు పెంచారు. అధికారంలోకి రావడం తథ్యమంటూ ప్రకటనలు చేస్తున్నారు.

అయితే బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నా.. వారిలో ఓ భయం మాత్రం నిత్యం వెంటాడుతూనే ఉందని వారి మాటల ద్వారా స్పష్టమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని అమలు చేయకపోవడం ఎప్పటికైనా తమ కొంప ముంచుతుందనే భావన కమలం నేతల్లో నెలకొంది. అదే విధంగా విభజన చట్టంలో పేర్కొన్న రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు సహా ఇతర అంశాలు దెబ్బతీస్తాయని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు.. ఆయా అంశాలను ఎన్నికల సమయంలో ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ఫ్లాట్‌ఫాం సిద్ధం చేస్తున్నారు.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ ఫ్లాట్‌ఫాంను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కార్యక్రమం ఏదైనా సరే.. దాదాపు అన్ని సందర్భాల్లోనూ సోము వీర్రాజు ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకహోదా కన్నా.. ప్రత్యేకహోదా ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని ఎవరూ అడగకపోయినా చెప్పుకొస్తున్నారు. తన మాటలకు బలం చేకూర్చేందుకు చంద్రబాబు నాయుడు అన్న మాటలను సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రత్యేకహోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో ఎక్కువ నిధులు వచ్చాయని చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని సోము గుర్తు చేస్తున్నారు. అయితే జగన్‌ మాయలో పడి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని చెబుతూ.. ప్రత్యేక హోదా తాము ఇస్తామన్నా.. ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని చెబుతూ హోదా పాపం చంద్రబాబు ఖాతాల్లో విజయవంతంగా వేస్తున్నారు.

బీజేపీ సొంతంగా పోటీ చేసినా, పొత్తులతో పోటీ చేసినా.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకహోదాపై ఆ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా ప్రజల మెప్పును కమలం పార్టీ పొందే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీపై పడే ప్రభావం.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న వారిపై కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఏపీకి బీజేపీ సర్కార్‌ ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచన లేనట్లుగానే ఉంది. అందుకే ప్రత్యేకహోదా అంశాన్ని ఎన్నికల సమయంలో ఎదుర్కొనేందుకు కమలం పార్టీ నేతలు ఇప్పటి నుంచే ఫ్లాట్‌ఫాం సిద్ధం చేస్తున్నారు. మరి కమలం నేతల ప్రయత్నాలు ఎన్నికల సమయంలో ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.