iDreamPost
iDreamPost
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టుల కోసం పోరాటాలు సాగిస్తామంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పోరాటాలేవో ఢిల్లీలో చేయాలని అధికారపార్టీ నేతలు సూచిస్తున్నారు. శనివారం శ్రీకాకుళంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సోము పలు అంశాలపై స్పందించిన తీరును వైఎస్సార్ సీపీ నేతలు తప్పు పడుతున్నారు. నీటి ప్రాజెక్టులపై సడన్ గా ప్రేమ ఒలకబోస్తున్న సోము ఇన్నాళ్లుగా పోలవరం ప్రాజెక్టు నత్తనడకన సాగడానికి కారణమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులే విడుదల చేస్తామని, ఆర్ అండ్ ఆర్ తమకు సంబంధంలేదని కేంద్రం తప్పుకోవడం వల్ల పోలవరం భారం రాష్ట్రప్రభుత్వం పై పడింది.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంటే తమ పార్టీ ప్రభుత్వానికి ఎందుకు నచ్చచెప్పడం లేదు? అని అడుగుతున్నారు. వెనుకబడిన
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఏడింటికీ బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మాట తప్పిన కేంద్రంపై పోరాడాలని అనిపించలేదా? ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి మాట తప్పిన సొంత పార్టీని ఎందుకు ప్రశ్నించరు? అని అడుగుతున్నారు.
పౌరసరఫరాల శాఖను రద్దు చేయాలట!
దళారులకు, మిల్లర్లకు వత్తాసు పలుకుతున్నందున పౌరసరఫరాల శాఖను రద్దు చేయాలని సోము డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. ఎటువంటి ఆధారం చూపకుండా రవాణా చార్జీల నెపంతో మిల్లర్లు, అధికారులు రూ.వంద కోట్లు పంచుకున్నారని ఆరోపించి ఇటువంటి డిమాండ్ చేయడం ఏమిటి? రూ.వంద కోట్ల అవినీతి అంటూ గాలి విమర్శలు చేస్తే మీ మాటకు విలువ ఏముంటుంది. తాము అధికారంలోకి వస్తే దేవదాయ శాఖను రద్దు చేస్తామని గతంలో చెప్పిన సోము ఇప్పుడు పౌరసరఫరాల శాఖ రద్దు కోరుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం అన్ని శాఖలు రద్దు చేసి రూ. 50కి చీప్ లిక్కర్ ఇవ్వడానికి ఒక్క ఆబ్కారీ శాఖను మాత్రమే ఉంచుతారేమో అని ఎద్దేవా చేస్తున్నారు. ఏ శాఖలోనైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటారు కాని రద్దు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
మీ పలుకుబడిని ఉపయోగించండి..
రోజుకో హామీ ఇస్తూ, ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలక్షేపం చేసేకన్నా నిజంగా వెనుకబడిన ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కేంద్రంలో సోము తన పలుకుబడిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. విభజన కష్టాలతో సతమతమవుతున్న ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రప్పించడానికి, రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన హామీల అమలుకు సోము పోరాడాలి. అంతేతప్ప ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తున్న తమ ప్రభుత్వంపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఏముంది అని సోమును వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read : ఇచ్చే ఉద్దేశం లేకపోయినా ఏపీకి మోదీ ఇస్తున్నారట..!