Idream media
Idream media
ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య రాజకీయ ప్రేమాయణంపై చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవల కుప్పం పర్యటనలో రెండు పార్టీల పొత్తును ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రేమ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలని అన్నారు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. టీడీపీపై ప్రేమ ఉందని బహిరంగంగా చెప్పలేదు కానీ, పొత్తులపై జనసైనికులతో చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉందని చెప్పారు. అయితే, ఈ సందర్భంగా పవన్ జనసైనికులతో అన్నారు కానీ, పొత్తు పార్టీ బీజేపీతో చర్చిస్తామని పేర్కొనకపోవడంతో అనుమానాలు మొదలవుతున్నాయి. జనసైనికుల్లో మెజార్టీ మొదటి నుంచీ బీజేపీ తీరును వ్యతిరేకిస్తున్నారు. అవసరానికి వాడుకుంటోందనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ తాజా వ్యాఖ్యలు బీజేపీని అంతర్మథనంలో పడేశాయి.
ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు మైండ్ గేమ్ అడుతున్నాయని అన్నారు. ఆయన ఏ పార్టీని ఉద్దేశించి అన్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే పొత్తుల గురించి చర్చ సాగుతోంది.. అయితే, అదంతా కొందరు ఆడుతోన్న మైండ్ గేమ్, దానికి త్వరలోనే చెక్ పెడతాం అంటున్నారు సోము వీర్రాజు.
వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివేకానందుని స్ఫూర్తిని నింపుకున్న యువతదే అభివృద్ధిలో కీలక పాత్ర అన్నారు.. యువతను ప్రభావితం చేసేలా కొందరు మైండ్ గేమ్స్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ఏపీలో జరిగే మైండ్ గేమ్ రాజకీయాలకు చెక్ పెడతాం అన్నారు. మైండ్ గేమ్‌తో కొన్ని పార్టీలు ప్రభావితం చేస్తున్నాయని అన్నారు సోమువీర్రాజు.. పొత్తుల విషయంలో కావచ్చు.. అభివృద్ధి విషయంలో కావచ్చు.. కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారని.. అందరికీ త్వరలోనే చెక్ పెడతామని ప్రకటించారు. ఇక, 2014 తర్వాత ఏపీని అభివృద్ధి చేస్తోంది బీజేపీనే అన్నారు సోము వీర్రాజు.. ఏపీ భవిష్యత్ అభివృద్ధిలో బీజేపీ-జనసేన పార్టీలు భాగస్వాములు అవుతాయన్నారు.