iDreamPost
android-app
ios-app

తొలి దశ పోలింగ్‌కు ముందు టీడీపీకి ఊరట

తొలి దశ పోలింగ్‌కు ముందు టీడీపీకి ఊరట

తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ముందు టీడీపీ ఊరట లభించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడకు బెయిల్‌ మంజూరైంది. శ్రీకాకుళం జిల్లా సొంపేట అదనపు జిల్లా కోర్టు అచ్చెం నాయుడకు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత అచ్చెం నాయుడు జైలు నుంచి విడుదల కానునున్నారు. రేపు మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ విడుదల ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. అచ్చెం నాయుడుతో పాటు 21 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

స్వగ్రామం నిమ్మాడలో పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైన వ్యక్తిని »ñ దిరించిన కేసులో అచ్చెం నాయుడును ఈ నెల 2వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానం అచ్చెంనాయుడుకు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని అచ్చెంనాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 4వ తేదీన విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలను విన్న శ్రీకాకుళం జిల్లా సోంపేట న్యాయస్థానం తదుపరి విచారణను ఈ రోజు సోమవారానికి వాయిదా వేసింది. కేసు డైరీ న్యాయస్థానానికి రాని కారణంగా విచారణ వాయిదా పడింది.

స్వగ్రామం నిమ్మాడలో నాలుగు దశాబ్ధాలుగా అచ్చెం నాయుడు, ఎర్రన్నాయుడులు చెప్పిందే వేదం. సంచాయతీ సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవం చేసుకునేవారు. పోటీకి వచ్చిన వారిని అడ్డతొలిగించుకునేందకు సామదానబేధదండోపాయలను ప్రయోగించేవారు. అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడం, అచ్చెం నాయుడు కుటుంబంపై ఉన్న వ్యతిరేకతల నేపథ్యంలో అచ్చెం నాయుడు సమీప బంధువు కింజారపు అప్పన్న పోటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను పోటీ నుంచి తప్పించేందుకు అచ్చెం నాయుడు బెదిరింపులకు దిగారు. అయినా వినని అప్పన్న నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవగా.. నామినేషన్‌ కేంద్రం వద్దే అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో అచ్చెం నాయుడు, ఆయన సోదరుడు హరిప్రసాద్‌ సహా 22 మందిపై కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ కోసం అచ్చెం నాయుడును తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడంతో విడుదలకు మార్గం సుగమమైంది.