Idream media
Idream media
దాదాపు పది నెలలుగా కరోనా వల్ల ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నా.. విశాఖలో గ్యాస్ లీకేజీ అయి సామాన్యుల ప్రాణాలు పోయినా.. విజయవాడ రమేష్ ఆస్పత్రిలో అగ్రి ప్రమాదం సంభవించి కోవిడ్ బాధితులు చనిపోయినా.. హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయటకు రానీ చంద్రబాబు.. ఈ రోజు ఆలయ పరిరక్షణ యాత్ర పేరుతో విజయనగరం జిల్లా రామతీర్థం వచ్చారు. రాజకీయ ప్రయోజనాలే తనకు పరమావధి అని ఇప్పటికే కరోనా సమయంలో నిరూపించుకున్న చంద్రబాబు.. దానికి కొనసాగింపుగానే ఈ రోజు విజయనగరం జిల్లాకు వచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే వ్రతం చెడ్డా.. ఫలితం దక్కితే చాలు అన్న సామెత మాదిరిగా టీడీపీ అధినేత రాజకీయం చేస్తున్నా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం బాబు ప్రయత్నాలకు బ్రేకులు వేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న సోము వీర్రాజు.. అక్కడ నుంచే చంద్రబాబు పర్యటనపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. హిందుత్వాన్ని భుజానెత్తుకున్నాననేలా నుదిటిన బోట్టుపెట్టుకుని మరీ విజయనగరం వచ్చిన చంద్రబాబుకు సోము విమర్శలతో గండిపడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అధికారికంగా విజయవాడలో 30 గుళ్లను కూల్చారని సోము గుర్తు చేశారు. వాటిని తిరిగి కడతామని కమిటీ వేసినా.. కట్టలేదని మండిపడ్డారు. శ్రీశైలంలో రబ్బానీ చేత కార్యక్రమాలు చేయించిన చంద్రబాబుకు ఇప్పుడు హిందుత్వం, రామతీర్థం గురించి మాట్లాడే అవసరం లేదని తాము భావిస్తున్నామంటూ.. సుతిమెత్తగా చంద్రబాబుకు సోము వీర్రాజు చురకలు అంటించారు.
హిందుత్వంపై పేటెంట్ తమదేనని సోము వీర్రాజు మరో మారు తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. రామతీర్థం ఘటనను తాము రాజకీయ కోణంలో చూడడంలేదన్న ఆయన.. ఇది హిందువుల మనోభావాలు, ధార్మికపరమైన అంశమంటూ చెప్పుకొచ్చారు. మెజారిటీ హిందువులకు చెందిన అంశమన్న సోము.. ఆత్మాభిమానానికి, స్వాభిమానానికి అనుగుణంగా రామతీర్థం అంశాన్ని బీజేపీ స్వీకరిస్తుందంటూ చెప్పడంతో బీజేపీ స్టాండ్ ఏమిటో తేల్చి చెప్పారు. కరోనా సమయంలోనూ వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ నుంచి విజయనగం జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు.. సోము వీర్రాజు ఢిల్లీ నుంచే బ్రేకులు వేయడం తమ్ముళ్లకు రుచించని అంశంగా మిగులుతోంది. మరి సోము విమర్శలకు.. చంద్రబాబు స్పందిస్తారా..? లేక ఎప్పటిలాగే బీజేపీ విమర్శలకు మౌనాన్నే సమాధానంగా ఇస్తారా..? వేచి చూడాలి.