iDreamPost
android-app
ios-app

అలా మాట్లాడడం బాబుకే సాధ్యం..!

అలా మాట్లాడడం బాబుకే సాధ్యం..!

సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సీనియర్‌ నేతలు ఆ అనుభవంతో ప్రజలకు వివిధ అంశాలపై హితబోధ చేస్తుంటారు. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు, సూచనలు చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అదే పనిలో ఉన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సం రోజున పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. దేశంలోనే సీనియర్‌ను తాను అంటూ మొదలు పెట్టిన చంద్రబాబు.. కొందరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు పెంచే పార్టీ టీడీపీ అని కొనియాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ ఆరోపణలు చేశారని వాపోయారు.

పొంతలేని మాటలు కొత్తకాదు..

కొందరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని చంద్రబాబు అనడంలో వింతేమీ లేదని ఆయన రాజకీయ ప్రత్యార్థులు అంటున్నారు. పొంతనలేని, తనకు సూటవని మాటలు చంద్రబాబు గతంలోనూ మాట్లాడారని గుర్తు చేస్తున్నారు. రాజకీయాలను డబ్బు మయం చేసి, ఓటర్లకు నగదు ఇచ్చే సంస్కృతిని చంద్రబాబే తెచ్చారని ఆయన సమకాలికులు పలు సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఐదు కోట్ల రూపాయలు లంచం ఆఫర్‌ చేసి, 50 లక్షల రూపాయలు ఇస్తూ ఆడియో, వీడియో ఆధారాలతో సహా దొరికిపోయారు. 2015లో జరిగిన ఈ పరిణామం తర్వాత.. 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై ఉన్న హక్కును వదులుకుని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాలనను హుటాహుటిన విజయవాడకు మార్చిన విషయం గుర్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యేలను కొనడం విలువలా..?

రాజకీయాల్లో టీడీపీ విలువలు పెంచే పార్టీ అని చంద్రబాబు అనడాన్ని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఎన్టీఆర్‌ హాయంలో టీడీపీ విలువలు కలిగిన పార్టీయేనని, కానీ టీడీపీని చంద్రబాబు తన చేతిలోకి తీసుకున్న తర్వాత.. ఆ విలువలు నశించాయని విమర్శిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు విలువలే ఉంటే.. గత ప్రభుత్వ హాయంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేవారు కాదని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు వారు టీడీపీ అభివృద్ధిని చూసి వచ్చారనుకున్నా.. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రిపదవులు ఇవ్వడంతో వారిని ప్రలోభాలు పెట్టారని స్పష్టమైంది. ఈ ఘటన జరిగి దశాబ్ధాలు కాలేదు. గత ప్రభుత్వ హాయంలోనే జరిగింది. అయితే ఆ విషయాన్ని ప్రజలు మరిచిపోయారనో, లేదా చంద్రబాబే మరిచిపోయి.. విలువలు గురించి మట్లాడుతుండడం విశేషమని వైసీపీ నేతలు చురకలు అంటిస్తున్నారు.

అమరావతిపై ఆరోపణలు అలానే ఉన్నాయ్‌..

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది. ఆ ఆరోపణలు నిజం కాదని నిరూపతమైనట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. తనను అనవసరంగా నిందించారనేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ విచారణలు జరగకుండా, కోర్టుల్లో స్టేలు తెచ్చుకున్నంత మాత్రనా.. ఆరోపణలు, అభియోగాలు నిజం కాదని నిరూపితమైనట్లు కాదన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. దమ్ముంటే నిరూపించాలంటూ అసెంబ్లీలో, మీడియా సమావేశాల్లో సవాళ్లు విసిరిన చంద్రబాబు.. విచారణ ప్రారంభమైన తర్వాత తన పార్టీ నేతలైన వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లతో కోర్టుల్లో పిటీషన్లు వేయించి స్టేలు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. విచారణ జరగకుండా స్టే లు ఇస్తే.. ఆరోపణలు, అభియోగాలు నిజం కాదని న్యాయస్థానాలు చెప్పినట్లేనని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉన్నారు.