అవి ఉన్న వాళ్లు అందరూ జర్నలిస్టులే..!

చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ డాటా,సోషల్ మీడియా వేదికలను ఉపయోగించడం తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో జర్నలిస్టులే. అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ మొబైల్ డేటా లభించడం, అదే సమయంలో స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభించడంతో.. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల అవతారం ఎత్తుతున్నారు. తమకు తెలియకుండానే సమాజానికి మేలు చేస్తున్నారు. గతంలో టీవీ చానళ్లు, పత్రికల రిపోర్టర్లు మాత్రమే..రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల అవినీతి, అక్రమాలను బట్టబయలు చేసే వారు.

అయితే ఇప్పుడు ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ఆగమనంతో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు, అధికారుల అవినీతి అక్రమాలను బట్టబయలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అవినీతి అక్రమాలపై వస్తున్న వీడియోలు, ఫోటోలు, ఇతర ఆధారాలను ఆయా విభాగాల అధికారులు పరిగణలోకి తీసుకొని అక్రమాలు అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటుండడం గమనార్హం.

తాజాగా హైదరాబాద్ లో అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆటోవాలా నుంచి వారు డబ్బులు వసూలు చేయడమే ఇందుకు కారణం. వీరి అవినీతి ని ఓ సామాన్యుడు బట్టబయలు చేశాడు. జాంబాగ్ లోని ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఆదివారం ట్రాలీ ఆటో ద్వారా వ్యాపారి సరుకు రవాణా చేసేందుకు సిద్దమయ్యారు. ఆటో వెళ్తున్న సమయంలో అఫ్జల్ గంజ్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ పంచముఖి సురేష్, రమేష్ లు ఆటోను ఆపి బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు అన్ని అనుమతులు ఉన్నాయని ఆటోడ్రైవర్ చెప్పినా వినకుండా డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేకుంటే సీజ్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆటో వాలా డబ్బులు ఇవ్వడం తో వదిలేశారు.

ఈ తతంగాన్ని స్థానికుడు ఒకరు భవనంపై నుంచి మొబైల్ లో వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఆ వీడియో కాస్త నగర సీపీ అంజనీ కుమార్ కు చేరడంతో వెంటనే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. స్టేషన్ సిబ్బంది పై సరైన పర్యవేక్షణ లేని కారణంగా సిఐ కు ఛార్జి మెమో జారీ చేశారు.

Show comments