తెలుగు తెరపై ఫెయిలైన మలయాళం ఫ్రెండ్స్ – Nostalgia

క్రేజ్ ఉన్న కాంబినేషన్లు ఓపెనింగ్స్ వరకు సహాయపడతాయేమో కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడాలంటే మాత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండాలి. ఇందులో ఏ మాత్రం లెక్క తప్పినా ఫలితం చాలా నిరాశాజనకంగా ఉంటుంది. దానికి ఉదాహరణగా ‘స్నేహమంటే ఇదేరా’ని చెప్పుకోవచ్చు. 1999లో మలయాళంలో దర్శకుడు సిద్ధిక్ ‘ఫ్రెండ్స్’ అనే మూవీ బ్లాక్ బస్టర్ హిట్. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. తమిళంలో సిద్ధికే అదే టైటిల్ తో సూర్య విజయ్ ల కాంబోలో తీస్తే అక్కడా హిట్టు కొట్టింది. దీన్ని తర్వాత తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అది వేరే విషయం.

Also Read: ఏనుగుతో సాహసం భళారే – Nostalgia

ఆ సమయంలో నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా వరస హిట్ల తర్వాత నాగార్జునను పరాజయాలు పలకరించాయి. బావ నచ్చాడు, అధిపతి, ఆకాశ వీధిలో, ఎదురు లేని మనిషి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇలా లాభం లేదని మరోసారి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న తరుణంలో నిర్మాత ఆర్ బి చౌదరి తెచ్చిన ఫ్రెండ్స్ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. అప్పటికే హీరోగా సత్యం హిట్ తో పేరు తెచ్చుకున్న అల్లుడు సుమంత్ తో కాంబో అనగానే ఇంకేమి ఆలోచించలేదు. తరుణ్ తో ప్రియమైన నీకు లాంటి సక్సెస్ ఫుల్ మూవీ ఇచ్చిన బాలశేఖరన్ ని దర్శకుడిగా తీసుకుని శివ శంకర్ కు స్వరాలు సమకూర్చే బాధ్యతను అప్పగించారు. పెద్దగా మార్పులు లేకుండా స్క్రిప్ట్ సిద్ధమయ్యింది.

Also Read: మూడు పాత్రలతో డబుల్ కామెడీ – Nostalgia

ఇది ముగ్గురు స్నేహితుల కథ. టేకాఫ్ చక్కగానే ఉన్నప్పటికీ కథాక్రమం ముందుకు వెళ్లేకొద్దీ సింక్ కాని కామెడీ, సెకండ్ హాఫ్ లో శృతి మించిన సెంటిమెంట్ డ్రామా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. ఏ అంశాలు ఒరిజినల్ వెర్షన్ లో ప్లస్ అయ్యాయో వాటిని రీమేక్ లో సరిగ్గా రాసుకోకపోవడం వల్ల అవే ఇక్కడ తేడా కొట్టి మైనస్ అయ్యాయి. భూమిక, ప్రత్యుష హీరోయిన్లుగా చేయడం ఉపయోగపడలేదు. ఒకటి రెండు తప్ప పాటలు కూడా సో సోనే. 3 గంటల నిడివి దీనికి శాపంగా మారింది. 2001 అక్టోబర్ 26న స్నేహమంటే ఇదేరా రిలీజయ్యింది. సరిగ్గా అదే రోజు వచ్చిన శరత్ కుమార్ డబ్బింగ్ సినిమా నరసింహుడు, ముత్యం, మేనక, మంగమ్మ రంగమ్మ ఇలా మరో నాలుగు సినిమాలు అన్నీ కలిపి హోల్ సేల్ గా డిజాస్టర్ కావడం ఆ డేట్ కి దక్కిన మరో ఘనత

Also Read: పొడవు సినిమాల చిట్టి కథలు – Nostalgia

Show comments