ఏనుగుతో సాహసం భళారే - Nostalgia

By iDream Post Jul. 19, 2021, 06:50 pm IST
ఏనుగుతో సాహసం భళారే - Nostalgia

మాములుగా మనుషులతో యాక్ట్ చేయించుకోవడమే ఒక రకంగా సవాల్ లాంటిది. ఇక చిన్నపిల్లలతో సరేసరి. అలాంటిది జంతువులతో చేయడం అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ ఇలాంటివి చేసినవాళ్లను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. ఇప్పుడంటే గ్రాఫిక్స్ వల్ల యానిమల్ క్రియేషన్ సులభమయ్యింది కానీ ఒకప్పుడు నిజంగానే అడవులు, జూల నుంచి తెచ్చుకుని ఆపసోపాలు పడుతూ చేయించుకునేవాళ్ళు దర్శకులు. సరే కోతి, పాము లాంటి వాటిని ఏదోలా మేనేజ్ చేసుకోవచ్చనుకుంటే ఏకంగా ఏనుగుని పెట్టి అది కూడా టైటిల్ రోల్ లో హీరోకు సమానంగా ప్రాధాన్యం ఇస్తే దాన్నేమంటారు. అదే రాజేంద్రుడు గజేంద్రుడు.

80 దశకం మధ్యలో సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో వచ్చిన ఇద్దరు మిత్రులు ఎస్వి కృష్ణారెడ్డి, కె అచ్చిరెడ్డి. రాగానే రెడ్ కార్పెట్ వేసే రోజులు కావు కనక మొదట్లో హైదరాబాద్ కేంద్రంగా స్వీట్ల వ్యాపారం మొదలుపెట్టారు. అందులో సక్సెస్ దక్కింది. తర్వాత టి పొడి, చిన్నపిల్లల తినుబండారాలు అమ్మారు. అదీ విజయవంతమయ్యింది. కానీ దృష్టి మాత్రం సినిమా మీదే ఉండేది. అందుకే నిర్మాణం కాకుండా మొదట్లో డబ్బింగ్ సినిమాల వ్యాపారం మొదలుపెట్టారు. సర్వర్ సుందరం రీ రిలీజ్, సూర్య ది గ్రేట్, దర్యాప్తు లాంటి చిత్రాలు బాగానే సొమ్ములు తెచ్చాయి. మనీషా బ్రాండ్ తో వీడియో క్యాసెట్ల బిజినెస్ ని కిషోర్ రాఠితో కలిసి చేశారు.

ఎన్నో టైటిల్స్ లాభాలను ఇచ్చాయి. మనీషా అంటే క్వాలిటీ అనే పేరు వచ్చింది. అప్పుడు సినిమా తీయాలనే సంకల్పం మళ్ళీ మొదలయ్యింది. కాట్రగడ్డ రవితేజ దర్శకుడిగా తీసిన కొబ్బరి బొండం సూపర్ సక్సెస్. దానికి కథ స్క్రీన్ ప్లే సంగీతం అందించిన ఎస్వి కృష్ణారెడ్డి మిత్రుడి ప్రోత్సాహంతో రాజేంద్రుడు గజేంద్రుడుతో డైరెక్టర్ గా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య జంటగా ఏనుగు ప్రధాన పాత్రలో కామెడీ సెంటిమెంట్ మ్యూజిక్ అన్నీ సమపాళ్ళలో మేళవించి తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు బాగా వచ్చింది. 1993 ఫిబ్రవరి 4న రిలీజైనఈ సినిమా నెల ముందు వెనుక వచ్చిన పెద్ద చిత్రాల విపరీతమైన పోటీని తట్టుకుని ఘనవిజయం సాధించి ఎస్వి గొప్ప భవిష్యత్తుకి బంగారు బాటలు వేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp