Idream media
Idream media
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జరిగిన 241.76 కోట్ల రూపాయల కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న సంస్థ మాజీ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 16వ తేదీన గంటా సుబ్బారావుతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ కోసం గంటా సుబ్బారావు ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులకు కాలేజీ స్థాయిలోనే ఉద్యోగం సాధించేలా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ప్రభుత్వం కేటాయించిన నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ మొత్తం ఖర్చు చేశాయి. నైపుణ్య శిక్షణ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 370.78 కోట్ల రూపాయల నిధుల్లో.. 241.78 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఫోరెన్సిక్ ఆడిట్ తేల్చింది. అప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన గంటా సుబ్బారావుతోపాటు సలహాదారుడుగా ఉన్న మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ, శిక్షణ సంస్థలు సైమెన్స్, డిజైన్స్‌టెక్ అధిపతులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సహా మొత్తం 26 మందిపై సీఐడీ వివిధ సెక్షన్ల కింద ఈ నెల 9వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
ముందస్తు బెయిల్ తెచ్చుకున్న లక్ష్మీ నారాయణ..
ఈ కుంభకోణంలో ముఖ్య సూత్రధారి అని సీఐడీ అనుమానిస్తున్న సంస్థ మాజీ సలహాదారు, మాజీ ఐఎఎస్, చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన లక్ష్మీ నారాయణ ఇంట్లో ఈ నెల 10వ తేదీన సీఐడీ సోదాలు చేసింది. ఆ సమయంలో ఒత్తిడికి లోనైన లక్ష్మీనారాయణ అస్వస్థతగా ఉందంటూ ఆస్పత్రిలో చేరారు. సోదాలు తర్వాత సీఐడీ అధికారులు 13వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరయిన సమయంలో అరెస్ట్ చేస్తారనే భయంతో.. లక్ష్మీ నారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అవకుండా లక్ష్మీ నారాయణ తప్పించుకోగా.. సుబ్బారావు జైలుకు పోక తప్పలేదు. ఈ రోజు గంటా సుబ్బారావుకు కూడా బెయిల్ రావడంతో.. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
Also Read : సీఐడీ కేసు.. లక్ష్మీనారాయణకు ‘ముందస్తు’ రక్షణ