iDreamPost
android-app
ios-app

స్వరాష్ట్ర స్వప్నం సాకారం వెనుక.. ఎన్నో త్యాగాలు చేసిన తెలంగాణ నేల

స్వరాష్ట్ర స్వప్నం సాకారం వెనుక..  ఎన్నో త్యాగాలు చేసిన తెలంగాణ నేల

తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణ… ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం.. ఎందరో ప్రాణ త్యాగాల ఫలితం.. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం. దశాబ్దాలుగా సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో తొలి సారి ఉధృత రూపం దాల్చింది. ఆనాటి నుంచి ఏదో రూపంలో కొనసాగినా ప్రత్యేక పోరాటం మళ్లీ 2012లో తీవ్ర రూపం దాల్చింది. ఈ సారి తాడో పేడో తేల్చుకుందాం అనే స్థాయికి తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పోరుబాట సాగించారు. వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించాచు. మిలియన్ మార్చ్, సడక్ బంద్, రైల్ రోకో.. ఇలా ఎన్నో రూపాల్లో ఉద్యమం నడిచింది.

ఇక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29న టీఆర్ఎస్ అధినేత ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. టీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళనలతో అట్టుడికించారు. నాటి ఢిల్లీ పెద్దల ను గడ గడ లాడించారు. అదే సంవత్సరం డిసెంబర్ 3న విద్యార్థి శ్రీకాంత చారి ఆత్మ బలిదానం తో రాష్ట్రం అట్టుడికింది. ఉద్యమం వేడెక్కింది. దీంతో 2009 డిసెంబర్ 7న అఖిల పక్షం తొలి సారిగా భేటీ అయింది. రాష్ట్ర విభజన కోసం 2010లో శ్రీ కృష్ణ కమిటీ ఏర్పడింది. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ బిల్లుపై చర్చ జరిపింది. అదే సంవత్సరం అక్టోబర్ 3న కేంద్ర మంత్రి వర్గం బిల్లుకు ఆమోదం తెలిపింది.

తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఉద్యమాల నేపథ్యంలో 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లును లోక్ సభ కూడా ఆమోదించింది. ఆ వెంటనే ఫిబ్రవరి 20 న రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. మార్చి 1, 2014 న రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. జూన్ 2, 2014 న దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ క్షణం ప్రజల ఆనందానికి హద్దులు లేవు. ఉద్యమాలతో ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ఆనందంతో నాట్యం చేసింది.

ఈ రాష్ట్రం ఆవిర్భావం వెనుక ఎందరో విద్యార్థుల బలి దానాలు ఉన్నాయి. ఉద్యోగుల అనితర సాధ్యమైన ఉద్యమ స్ఫూర్తి ఉంది. రాష్ట్ర సాకారానికి కేసిఆర్ కృషి అత్యున్నతమైనది. ఆయన కృషికి తోడు ప్రొఫెసర్ జయశంకర్, కోదండ రామ్ వంటి మేధావుల దిశా నిర్దేశాలు ఉన్నాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే… తెలంగాణ ఉద్యమ చరిత్ర మహోన్నతమైనది. సకల జనుల ఉద్యమ నేర్పుతో ఆవిర్భవించిన తెలంగాణ ఆరేళ్లలో సాధించిన ప్రగతి నాటి పోరాట యోధుల త్యాగ ఫలమే.