Idream media
Idream media
సిరివెన్నెల వెళ్లిపోయింది, మనకి పాటల వెలుగుని వదిలి. డిగ్రీ రోజుల్లో అనంతపురం వెంకటేశ్వర టాకీస్‌లో సిరివెన్నెల చూశాను. అప్పటికే విశ్వనాథ్, కేవీ మహదేవన్‌ల భక్తున్ని. పేరు కనపడితే చూసేవాన్ని. (ఇప్పుడు నాకు విశ్వనాథ్ ఎమోషన్ నచ్చుతుంది కానీ, కథ నచ్చదు. జయప్రద బొట్టు కరిగిపోకుండా సాగర సంగమంలో కమల్‌హాసన్ చేసింది కామెడీ అనిపిస్తుంది) సిరివెన్నెల బోర్ సినిమా కానీ, పాటలు అద్భుతం. రాసింది కొత్త రచయిత సీతారామశాస్త్రి. తర్వాతి రోజుల్లో తెలుగు పాటకి పెద్ద దిక్కు.
పాటతో మనకెంత అనుబంధం అంటే పాటలు వింటూ పెరుగుతాం. టీవీ, వీడియోలు వచ్చాక చూస్తూ పెరిగాం. నేను పుట్టాను పాట (రచన ఆత్రేయ) అర్థం కాకపోయినా పాడుకున్నాను. నేను నవ్వితే ఈ లోకం ఎందుకు ఏడుస్తుందో తెలియడానికి కొంచెం పెద్దవాడు కావాలి. దశాబ్దాల నుంచి సిరివెన్నెల పాటల్ని గుర్తు చేసుకుంటూ, కూనిరాగాలు తీసుకుంటూ జీవించినవాన్ని. ప్రతి సందర్భంలోనూ ఆయన పాట , పాటలోని మాట వేగు చుక్కలయ్యాయి.
కష్టమొచ్చినపుడు దేవున్ని ఏదైనా అడుగుదామంటే (నేను ఆస్తికున్నో, నాస్తికున్నో నాకే తెలియదు. యూనివర్స్ అనేది మహాశక్తి, అదే దేవుడు కూడా!) ఆదిభిక్షువుని బూడదిచ్చేవాన్ని ఏమి అడిగేది అని సీతారామశాస్త్రి అడ్డు తగులుతాడు.
మెహదీపట్నం సర్కిల్‌లో పూలు అమ్ముడుపోక దిగాలుగా కూచున్న ఆడవాళ్లను చూస్తే తేనెలొలికే పూల బాలలకు మూణ్నాళ్ల ఆయువు ఇచ్చిన మాట గుర్తొస్తుంది. చాలా ఏళ్ల తర్వాత రాయదుర్గం కొండను చూసి బండరాళ్లకి చిరాయువుని ఇచ్చిన వాడిపై కోపం. జీవితంలోని అనేక సందర్భాల్లో ఈ పాట ఒక దీపదారి.
డెస్క్ సబ్ ఎడిటర్‌కి చాలా పద సంపద వుండాలి. మంచి హెడ్డింగ్‌లు సరైన అర్థంతో పెడితేనే ఆ వార్తకి విలువ. శ్రీశ్రీ మహాప్రస్థానం అక్షయపాత్రలా ఎందరికో క్యాప్షన్ దాత. సిరివెన్నెల పాటలు కూడా ఎన్నోసార్లు ఆదుకున్నాయి. కాళహస్తి టెంపుల్ వార్తలకి ఒకట్రెండుసార్లు ఆదిభిక్షువు , బూడిద ఇచ్చేవాడు వాడుకున్నాను.
సాక్షిలో పని చేస్తున్నప్పుడు ఒక కార్డు ముక్క వచ్చింది. ఇంటర్ చదువుతున్న తెలివైన అమ్మాయి పేదరికంతో చదువు మానేసింది. కూలీ పనులు చేస్తున్న తల్లి మంచం పట్టింది. ఇది కారణం. చేతిలో పైసా లేదు, ఉండడానికి ఇల్లు లేదు. (గుడిసె శిథిలావస్థలో వుంది) వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పేపర్ కాబట్టి సాయం చేస్తారనే ఆశతో రాసినట్టు చెప్పింది.
వెంటనే రిపోర్టర్ రమణారెడ్డికి ఫోన్ చేసి ఆ పల్లెకు పంపాను. చిత్తూరు జిల్లాలోని కల్లూరు సమీపంలో ఉంది. అతను ఆ అమ్మాయి పరిస్థితి, గుడిసె ఫొటోని పంపాడు. చాలా సేపు ఆలోచించి వార్త రాశాను. హెడ్డింగ్ తోచలేదు. పాట గుర్తొచ్చింది.
“ఏ తోడూ లేక ఎటు వైపు ఒంటరి పయనం”
మరుసటి రోజు ఆ అమ్మాయి జీవితం మారిపోయింది. అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకున్నాయి. సాక్షి గొప్పతనమే కాదు, మంచి క్యాప్షన్ అందించిన సిరివెన్నెలది కూడా.
జీవితమనే చేద బావిలో నుంచి మాటల్ని తోడి పాటలుగా అందించిన గొప్ప వ్యక్తి.
ఇవన్నీ రాయడానికి చాలా చదువుకుని, తెలుసుకుని వుంటే చాలదు. పండితుడితో పాటు ఒక తాత్వికుడు కూడా ఉండాలి. జగమంత కుటుంబం , ఏకాకి జీవితం మాటలు కూర్చడానికి ఎంతో ఫిలాసఫీ తెలియాలి. రాయిలోంచి బొమ్మని బయటికి తీసే శిల్పి కావాలి.
లక్ష్మీదేవి చంచలి. దొంగల్ని, దగుల్భాజీలను కూడా కరుణిస్తుంది. సరస్వతి మహాతల్లి. ఎంతో సేవ, పాదపూజ చేసుకుంటే నాలుగు అక్షరాల్ని అరిటాకులో వడ్డిస్తుంది. సీతారామశాస్త్రి సరస్వతీ పుత్రుడు. పదాల్ని అందెలుగా మార్చి నాట్యం చేయించగలడు. మాటకి ప్రాణం పోసి పాటని సృష్టిస్తాడు.
అక్షరాల్ని తూచే తరాజు, పాటల మారాజు. ఆయన లేడు. పాట వుంటుంది. తెలుగు వారి పెదాలపై నాట్యం చేస్తూ.
ఊపిరి ఆగిపోవచ్చు. ఆయన బతికున్న క్షణాలన్నీ పాటల తోటలుగా మిగిలాయి. తీపి రాగాల కోయిలమ్మకి నల్ల రంగు నలిమిన వాడే సిరివెన్నెలని తొందర పడి తీసుకెళ్లాడు తిక్క శంకరుడు. కోరినా, అడిగినా వెనక్కి ఇవ్వడు.