iDreamPost
android-app
ios-app

భారత దేశంలో రెండు ప్రాంతాలను ధాన్యాగారాలుగా మార్చిన తెల్లదొర

భారత దేశంలో రెండు ప్రాంతాలను ధాన్యాగారాలుగా మార్చిన తెల్లదొర

పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పం చెప్పే శ్లోకం !!
నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం !!

గోదావరి స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్లేయుడైన కాటన్ దొర గారిని నిత్యం స్మరించి తరిస్తున్నాము అని ఆ శ్లోకానికి అర్థం. మేలు చేసిన తెల్లదొరని సంస్కృత శ్లోకంతో ప్రార్ధిస్తూ తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు గోదావరి వాసులు.

ఆ తెల్లదొర పేరు సర్ ఆర్ధర్ థామస్ కాటన్. ఇంజనీరుగా భారతదేశానికి వచ్చి తమిళనాడులో తంజావూరు ప్రాంతాన్ని, ఆంధ్రలో గోదావరి జిల్లాలనూ కరువు బాధ నుంచి తప్పించి ధాన్యాగారాలుగా మార్చిన అపర భగీరధుడు.

1803 మేనెల 15వ తేధీన ఇంగ్లండులో జన్మించిన కాటన్ ఈస్టిండియా వారి సైనిక పాఠశాలలో చేరి 1819లో ఉత్తీర్ణుడై, కొంతకాలం ఇంగ్లాండులో పనిచేసి, తన పై అధికారులను మెఫ్పించి, భారతదేశంలో, అప్పటి మద్రాసు రాష్ట్ర ఇంజనీరింగ్ విభాగానికి పంపబడ్డాడు.

తంజావూరులో

మద్రాసు వచ్చాక ఆయన చేసిన సర్వేలో కావేరి నదీ పరివాహక ప్రాంతంలో కూడా కరువు పరిస్థితులు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కావేరి నదిమీద క్రీ. శ. రెండవ దశాబ్ధంలో కరికాల చోళుడు నిర్మించిన కల్లనై డ్యామ్ అప్పటికీ చెక్కుచెదరక చాలా భాగం పొలాలకు నీరందిస్తున్నా ఆ నీరు సరిపోకపోవడం, కల్లనై డ్యామ్ మీద చిన్న చిన్న మరమ్మతులు చేయవలసి రావడం గమనించిన కాటన్ కావేరి నది మీద ఎగువున ఒక ఆనకట్ట, దిగువన ఒక ఆనకట్ట నిర్మించి డ్యాముకు మరమ్మతులు చేయడం వలన తంజావూరు ప్రాంతం మొత్తానికి నీరందించ వచ్చని ప్రతిపాదనలు సిద్ధం చేసి తన పై అధికారుల ఆమోదం కోసం పంపించాడు.

చాలా అభ్యంతరాలు పెట్టి, కాటన్ కోరినదానికన్నా తక్కువ మొత్తం మంజూరు చేశారు కంపెనీ అధికారులు. కల్లనై డ్యామ్ నిర్మాణాన్ని అధ్యయనం చేసిన కాటన్ కావేరి నది మీద నిర్మించిన రెండు ఆనకట్టలనూ అదే పద్ధతిలో నిర్మించాడు. ఈ పద్ధతిలో నదీగర్భంలో మట్టి, రాళ్లు పోసి, దానిమీద సున్నం, కాంక్రీటు పోస్తారు. ఇలా కావేరి నది మీద రెండు ఆనకట్టలు నిర్మించి, కల్లనై డ్యామ్ కి మరమ్మతులు చేసి, అందులో పేరుకుపోయిన పూడిక తీయడం వలన తంజావూరు జిల్లా, దాని చుట్టుపక్కల చాలా మేరకు భూమి సాగులోకి వచ్చింది.

గోదావరి ప్రాంతంలో

తంజావూరులో సాధించిన విజయంతో మరింత ఉత్సాహం తెచ్చుకొని ఈసారి తన దృష్టిని గోదావరి వైపు మళ్ళించాడు కాటన్. అందుకు కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాడు. అయితే పన్నుల రూపంలో భారతీయులను దోచుకోవడం మీదే పూర్తి ధ్యాస పెట్టిన ఈస్టిండియా కంపెనీ అధికారులు అంచనాలను తగ్గించుకుంటూ వచ్చి 1847లో ఆమోదముద్ర వేశారు. ఆ సంవత్సరమే పని మొదలు పెట్టినా 1848లో ఆరోగ్య సమస్యలతో రెండు సంవత్సరాలు సెలవు మీద వెళ్ళాడు కాటన్. రెండు సంవత్సరాల తరువాత తిరిగివచ్చు 1852 నాటికి రాజమహేంద్రవరం వద్ద ఆనకట్ట నిర్మాణం పూర్తి చేశాడు. ఆ తర్వాత కృష్ణా నదీ జలాలు పొలాలకందేలా కాలువల నిర్మాణం పూర్తి చేశాడు.

ఈ రెండు ప్రాజెక్టులలో భాగంగా 370 మైళ్ళ పొడవున కాలువల నిర్మాణం చేశాడు. ఇందులో అధికభాగం జలరవాణాకి ఉపయోగపడేవే. అలాగే మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు నీరందించాడు.

ఇప్పుడు మరింత ఉత్సాహంతో భారత ఉపఖండంలో కరువన్నది మరెప్పుడూ తలెత్తకుండా దేశంలో నదీలన్నిటినీ అనుసంధానం చేసే బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశాడు కాటన్ దొర.

సరిగా ఇదే సమయంలో అంటే 1853లో మొదటిసారిగా భారతదేశంలో రైలు అడుగు పెట్టింది. పన్నుల రూపంలో వసూలు చేసిన సంపద తమ దేశానికి తరలించడానికి వీలుగా దానిని ఓడరేవుల వద్దకు త్వరగా చేర్చడానికి, ఎక్కడైనా అశాంతి, తిరుగుబాటు తలెత్తినపుడు వాటిని అణిచివేయడానికి వీలుగా వేగంగా సైనికుల తరలింపుకూ రైల్వే బాగా ఉపయోగపడుతుందని ఈస్టిండియా కంపెనీ రైలు మార్గాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడంతో నధుల అనుసంధానం మూలపడిపోయింది.

కాటన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా 1858లో పదవీ విరమణ చేసి ఇంగ్లాండు వెళ్లిపోయాడు. ఆ మరుసటి సంవత్సరం ఆయనకు నైట్ హుడ్ ఇచ్చారు. ఆ తరువాత రెండు సార్లు భారతదేశానికి వచ్చి, ఇరిగేషన్ అధికారులకు సలహాలు ఇచ్చాడు.

తను పదవీ విరమణ చేయడానికి కొంత ముందుగా పట్టుపట్టి ఆనకట్టలు నిర్మాణ, నిర్వహణ కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాడు. అదే పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు.

అంత కర్చు పెట్టి గోదావరి మీద ఆనకట్ట కట్టడం డబ్బు వృథా చేయడం అని కొందరు అధికారులు చేసిన ఫిర్యాదు మీద బ్రిటిష్ పార్లమెంటు ముందు 1878లో విచారణకు హాజరు కమ్మని ఆదేశించింది కాటన్ దొరను. “బాగా వరద ప్రవాహం ఉన్న సమయంలో ఒక రోజులో గోదావరి నదిలో ప్రవహించే నీరు మన థేమ్సు నదిలో ఒక సంవత్సరం మొత్తం ప్రవహించే నీటితో సమానం. అంత నీరు వృధాగా సముద్రం పాలవడం చూడలేక గోదావరి మీద ఆనకట్ట కట్టాను. అది తప్పని భావిస్తే చెప్పండి స్వయంగా పార్లమెంటు ముందు విచారణకు హాజరవుతాను “అని లేఖ రాశాడు కాటన్. మరో మాట లేకుండా అ అభియోగాన్ని తిరస్కరించింది పార్లమెంటు.

తన విశ్రాంత జీవితం ఇంగ్లండులో ప్రశాంతంగా గడిపిన కాటన్ దొర 96 సంవత్సరాల నిండు వయసులో మరణించాడు.

తమను కరువు కోరల్లోనుంచి కాపాడిన కాటన్ దొరను గోదావరి ప్రాంత వాసులు మర్చిపోలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన విగ్రహాలు మూడు వేల పైచిలుకు ఉన్నాయి. 1988లో రాజమండ్రిలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ఆర్థర్ కాటన్ మ్యూజియం ప్రారంభమయింది.