iDreamPost
android-app
ios-app

Bandaru Sravani – టీడీపీ లో ఆ అమ్మాయికి జేసీ ఫ్యామిలీనే పెద్ద దిక్కా…?

Bandaru Sravani – టీడీపీ లో ఆ అమ్మాయికి జేసీ ఫ్యామిలీనే పెద్ద దిక్కా…?

బండారు శ్రావణి శ్రీ… అనంతపురం జిల్లాలో గత నాలుగు నెలల నుంచి కాస్త ఎక్కువగా వినబడుతున్న పేరు. 2019 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బండారు శ్రావణి శ్రీ ఆ తర్వాత నియోజక వర్గం లో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమి తర్వాత ఆమె పార్టీ బలోపేతం కోసం కాస్త ఎక్కువగానే కృషి చేస్తున్నారు. చివరి నిమిషంలో పార్టీ అధినేత టికెట్ ప్రకటించడంతో కాస్త విజయం విషయంలో ఆమె అప్పట్లో నమ్మకం లేకుండానే పోటీ చేశారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి.

పార్టీకి ఆమె గ్లామర్ తోడవుతుందని పార్టీ అధిష్టానం కూడా భావించిందని ముఖ్యంగా యువతలో ఆమెకు క్రేజ్ వస్తుందని అంచనా వేశారని కానీ అనుకున్న విధంగా జరగలేదు అనేది పార్టీ అధిష్టానం ఆలోచన అని కొంతమంది వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో బండారు శ్రావణి శ్రీ కాస్త ఎక్కువగానే తిరుగుతున్నారు. అదేవిధంగా జిల్లాలో కూడా కొన్ని కార్యక్రమాల విషయంలో దూకుడుగా నే ముందుకు వెళ్తున్న బండారు శ్రావణి శ్రీ గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానం విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అని కామెంట్స్ ఉన్నాయి.

ముందు బండారు శ్రావణి శ్రీ జేసీ కుటుంబం తో సన్నిహితంగా ఉండటం జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులకు నచ్చలేదని జెసి దివాకర్ రెడ్డి ఆదేశాలమేరకు నడుచుకుంటూ రాజకీయం చేస్తారు అనే కామెంట్స్ పార్టీ వర్గాల్లో బాగా వినిపించాయి. అందుకే జేసీ కుటుంబం చేపట్టే కార్యక్రమాలు మినహా మరో కార్యక్రమంలో ఆమె పాల్గొనడం లేదు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో పార్టీ పనితీరుకు సంబంధించి ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసి పార్టీ క్షేత్రస్థాయి పనితీరుని తెలుసుకునే ప్రయత్నం చేసింది.

Also Read : Madagula TDP – ఆ కొత్త ఇంఛార్జి మాకొద్దు

ఇది బండారు శ్రావణికి ఏమాత్రం కూడా రుచించలేదు. దీంతో పార్టీ అధిష్టానం తీరును నిరసిస్తూ ఆమె నిరసన కార్యక్రమం కూడా గత నెలలో చేపట్టారు. దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఆమెతో మాట్లాడిన సరే ఆమె మాట వినకపోవడంతో జెసి దివాకర్ రెడ్డి ఆమెను ముందుకు నడిపిస్తున్నారు అని ఆయన చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారని చాలామంది భావించారు. పార్టీలో స్థానిక నాయకత్వంతో కూడా కలుపుకొని వెళ్లకుండా కేవలం జెసి దివాకర్ రెడ్డి తో సన్నిహితంగా ఉండే వారితో మాత్రమే బండారు శ్రావణి దగ్గర సంబంధాలు నెలకొల్పుకున్నారు అనే అభిప్రాయం కూడా కొంత మంది స్థానిక నాయకులలో వ్యక్తమైంది.

అయితే ఇటీవల పార్టీ అధిష్టానం టూ మెన్ కమిటీని వేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బండారు శ్రావణి ఆ తర్వాత వెళ్లి జేసీ దివాకర్ రెడ్డిని కలిసి తన నిరసన కార్యక్రమాలను విరమించుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజుల వ్యవధిలో మంగళగిరి వచ్చి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తో ఆమె కాసేపు సమావేశమయ్యారు. జిల్లా నాయకులు నుంచి తనకు వస్తున్న ఇబ్బందులను అదే విధంగా కొంతమంది నాయకులు తనను ఇబ్బంది పెడుతున్న తీరును ఆమె చంద్రబాబు ముందు ఏకరువు పెట్టారు.

అయితే ఇప్పుడు కొంతమంది చెప్తున్న అభిప్రాయం ప్రకారం చూస్తే జెసి దివాకర్ రెడ్డి కుటుంబం ఆదేశాల మేరకు ఆమె పనిచేయడమే ఆమె పతనానికి కారణం అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని, తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కూడా చెప్పలేని పరిస్థితి ఉందని, చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించిన తర్వాత చాలామంది రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ముగిసిపోయిందని, ఇప్పుడు బండారు శ్రావణి రాజకీయ భవిష్యత్తు కూడా అదే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Also Read : TDP – షరీఫ్‌ను ఆ విధంగా సెట్‌ చేశారు

గతంలో పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ సీటు విషయంలో రెండేళ్ళు మాత్రమే ఉండటంతో చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత ఆమె పార్టీ కోసం ఎంత కష్టపడినా సరే ఉపయోగం లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో మంగళగిరి సీటు ఆశించిన, 2019 ఎన్నికల్లో మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో వెళ్లిన ఆమెకు ఫలితం దక్కలేదు. ఇప్పుడు జెసి ఫ్యామిలీతో కలిసి దిక్కార స్వరం వినిపించిన బండారు శ్రావణి రాజకీయ భవిష్యత్తు కూడా అలాగే కాబోతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.