iDreamPost
android-app
ios-app

సిద్ధుకు పదవి దక్కేనా?

సిద్ధుకు పదవి దక్కేనా?

వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలలో పంజాబ్‌ కూడా ఉంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఫలితంగా అక్కడ కాంగ్రెస్‌ పుంజుకుంటోంది. గట్టిగా దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పార్టీదే విజయం అని భావిస్తున్న తరుణంలో సీఎం అమరీందర్‌, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత, అమృతసర్‌ ఎమ్మెల్యే నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు పార్టీలో కుంపట్లు రాజేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలకు చేపట్టింది. ఈ క్రమంలో బుధవారం పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలను సిద్ధూ కలవడం చర్చనీయాంశంగా మారింది.

వరుస సమావేశాలు

సిద్ధూ రాహుల్‌ గాంధీని కలిసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్‌ గాంధీని కలుస్తానని మంగళవారం మరోసారి చెప్పారు. రాహుల్‌ ఏమో ‘సిద్ధూతో సమావేశం ఉండదు’ అని మీడియాతో చెప్పారు. దీంతో సిద్ధూ వర్గానికి గట్టి షాక్‌ తగిలినట్టుయింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ప్రియాంకాతో సుదీర్ఘ సమావేశం జరిగిందని వెల్లడిస్తూ.. ఆమెతో దిగిన ఫొటోను సిద్ధు తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సమావేశం 4 గంటలపాటు జరిగిందని చెప్పారు. అయితే సిద్ధూతో సమావేశం ఉండదని రాహుల్‌ గాంధీ చెప్పిన మరుసటి రోజే ఆయన ప్రియాంకాను కలవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలకు ముందే సయోధ్య కోసం..

ఇదిలా ఉండగానే.. ప్రియాంకను కలిసిన తర్వాత ఢిల్లీలోని రాహుల్‌ గాంధీతో కూడా ఆయన నివాసంలో సిద్ధూ సమావేశమైనట్లు తెలిసింది. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. రాహుల్‌, ప్రియాంకలతో సమావేశం అనంతరం సిద్ధూకు పంజాబ్‌ పీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా అమరీందర్‌ను ఉంచుతూనే, సిద్ధూకు పీసీసీ బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉంది. ఎన్నికలకు ముందే వారిద్దరి మధ్యా సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తోంది.

సిద్ధూ.. ‘తప్పుదారి పట్టించే క్షిపణి’

పంజాబ్‌ కాంగ్రెస్‌లో తలెత్తిన విభేదాల నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌.. అమృతసర్‌ ఎమ్మెల్యే నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూని ‘తప్పుదారి పట్టించే క్షపణి’గా అభివర్ణించారు. సిద్ధూ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాను కలిసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమృతసర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సిద్ధూ ఎవరితోనూ కలవడు. ఆయన బీజేపీలో చేరినప్పుడు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సిద్ధూ ఆ పార్టీ నేతలను ‘దొంగలు’ అన్నారు. సిద్ధూ తప్పుదారి పట్టించే క్షిపణి. దానికి నియంత్రణ ఉండదు. అది ఏ దిశలోనైనా వెళ్లి ఎక్కడైనా తగలొచ్చు. ఒకవేళ అది సిద్ధూనే కొట్టినా ఆశ్చర్యం లేదు’ అన్నారు. కాగా.. సుఖ్‌బీర్‌ వ్యాఖ్యలపై సిద్ధూ దీటుగా స్పందించారు. ‘అవును మీ అవినీతి కార్యకలాపాలను నాశనం చేయడానికి నిర్దేశించిన మిసైల్‌ని’ అని బదులిచ్చారు.