Idream media
Idream media
తన,మన అనే భేదం లేకుండా విమర్శనాస్త్రాలు సంధించే పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ రూట్ మార్చేశాడు.గత కొన్ని నెలలుగా ప్రత్యర్థి పార్టీలపై కంటే సొంత పార్టీపై ఎక్కువగా విమర్శలు చేస్తున్న సిక్సర్‌ల సిద్ధూ ఈసారి ఆమ్‌ఆద్మీ పార్టీకి ఝలక్‌నిచ్చారు.తాను అధికారంలో ఉన్న ఢిల్లీలో అమలు చేయలేకపోయిన హామీని పంజాబ్‌లో ఎన్నికల వాగ్ధానంగా ఇవ్వడంతో కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అయ్యింది కేజ్రీవాల్ పరిస్థితి.
గత నెలలో పంజాబ్‌లోని మొహాలిలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని గెస్ట్ టీచర్లు చేపట్టిన నిరసనల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని సంఘీభావం తెలిపారు.పనిలో పనిగా తమ పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు టీచర్లును క్రమబద్దీకరిస్తామని హామీనిచ్చారు.ఇదే అంశం తాజాగా బూమ్ రాంగ్ అయి ఆప్ అధినేత కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంది.ఇవాళ కేజ్రీవాల్ ఇంటి ఎదుట గెస్ట్ టీచర్లు చేపట్టిన నిరసనలో పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ పాల్గొన్నారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు చేస్తోన్న నినాదాలకు తన కోరస్ కలిపారు.
ఘాటైన విమర్శలతో తమని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేజ్రీవాల్‌పై విరుచుకు పడేందుకు అవకాశం కోసం కాంగ్రెస్ వేచి చూసింది.ఈ నేపథ్యంలో ఢిల్లీ కాంట్రాక్ట్ టీచర్ల ఆందోళన రూపంలో కాంగ్రెస్ చేతికి అవకాశం అంది వచ్చింది.తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఢిల్లీ కాంట్రాక్ట్ టీచర్లు చేస్తున్న ధర్నాలో సిద్ధూ బైఠాయించారు. వారికి మద్దతుగా “ఢిల్లీ టీచర్లు ఇక్కడున్నారు,కేేేజ్రీవాల్ ఎక్కడున్నారు?” అంటూ సిద్ధూ నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పీసీసీ చీఫ్ సిద్ధూ కేజ్రీవాల్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు.ఢిల్లీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఎడ్యుకేషనల్ మోడల్ అదొక కాంట్రాక్టు మోడల్ అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో 1031 పాఠశాలలుంటే కేవలం 196 స్కూళ్లలోనే ప్రధానోపాధ్యాయులు ఉన్నారని ఆయన విమర్శించారు.ఇక 45 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగానే ఉండగా 22 వేల మంది గెస్ట్ టీచర్లతోనే పాఠశాలలను ఆప్ ప్రభుత్వం నడిపిస్తోందని ఆరోపించారు.కాంట్రాక్టు టీచర్లను క్రమబద్దీకరిస్తామని, శాశ్వత సిబ్బందితో సమానంగా వేతనాలు చెల్లిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది.కానీ గత ఏడేళ్లుగా ఆ హామీని కేజ్రీవాల్ సర్కార్ నెరవేర్చలేదు. పైగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఒప్పందాల పునరుద్ధరణతో గెస్ట్ టీచర్ల పరిస్థితిని దిగజార్చిందని సిద్ధూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ పంజాబ్ సంగతి పక్కనపెట్టి ముందుగా ఢిల్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సిద్ధూ చురకలు అంటించారు.కాగా కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలను గమనిస్తే కాంగ్రెస్ చర్య కేజ్రీవాల్‌కి ‘టిట్ ఫర్ టాట్’ అని చెప్పవచ్చు.