iDreamPost
iDreamPost
టాలీవుడ్ కే కాదు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ బాషల సినిమా షూటింగుల మీద ఓమిక్రాన్ పడగ మొదలైపోయింది. చాలా చోట్ల ఆంక్షలు, కర్ఫ్యూలు, 144 సెక్షన్లు ఉండటంతో కావాల్సిన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకోవడం ఇబ్బందిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి అలాంటి సీన్ లేదు కానీ ఇంకో రెండు మూడు రోజుల్లో ఇక్కడా నిబంధనలను తీసుకురాబోతున్నారు. తెలంగాణలో కేసులు పెరుగుదల గణనీయంగా ఉంది.హైదరాబాద్ లాంటి నగరాల్లో వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో రోగుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో రికార్డు అవుతోంది. ఈ నేపథ్యంలో వీటిని తట్టుకుని షూట్లను కొనసాగించడం సవాలే.
ఇప్పటికే మహేష్ బాబు, మంచు లక్ష్మి, తమన్, నితిన్ భార్య లాంటి సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడ్డారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవాళ్ళే. అయినా కూడా వీళ్ళను మహమ్మారి విడిచిపెట్టలేదు. త్వరగానే కోలుకుంటారు కానీ ఈ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోలేని సామాన్యుల పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాణాపాయం పెద్దగా లేకపోవడం ఊరట కలిగించే అంశమే అయినా మరీ నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు. షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలకు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్లు క్యాస్టింగ్ ఒమిక్రాన్ దెబ్బకు కాల్ షీట్స్ ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. ఇది నిర్మాతలకు చిక్కే.
పరిస్థితులు మళ్ళీ మునుపటిలా మారడానికి నెల పడుతుందో ఇంకో రెండు నెలలు అవసరమవుతుందో అంతు చిక్కడం లేదు. సంక్రాంతి రిలీజులకు జనం వస్తారా రారా అనే టెన్షన్ డిస్ట్రిబ్యూటర్లలో పెరిగిపోతోంది. అసలే పెద్ద సినిమాలు లేవు. ఆశలు పెట్టుకున్న బంగార్రాజు ఖచ్చితంగా వస్తాననే అంటున్నాడు కానీ చివరి నిమిషం దాకా ఏమైనా జరగొచ్చు. మిగిలిన మీడియం బడ్జెట్ సినిమాలకు ఓపెనింగ్స్ తెచ్చే విషయంలో టాక్ చాలా కీలకంగా మారనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా వారం దాటకుండానే డెఫిషిట్లు పడతాయి. అందుకే కొన్ని ఓటిటి విండోని బాగా తగ్గించుకుని మరీ ఒప్పందాలు చేసుకున్నాయట. చూద్దాం ఏం జరగనుందో
Also Read : 1945 Movie : 1945 రిపోర్ట్