నితిన్ ‘రంగ్ దే’ కి షాకింగ్ డీల్

సుమారు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని నితిన్ చేసిన భీష్మ దానికి తగ్గ అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. ఏకంగా 30 కోట్ల దాకా షేర్ వసూలు చేసి హీరోకే కాదు దర్శకుడికి కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఒకవేళ కరోనా తాకిడి లేకపోయి థియేటర్లు తెరుచుకుని ఉంటే ఫుల్ రన్ లో ఇంకో నాలుగైదు కోట్లు సులువుగా వచ్చి ఉండేవన్నది నిజం. దీని ప్రభావం ఇప్పుడు నితిన్ రాబోయే సినిమా రంగ్ దే మీద పడుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పుడు ఫైనల్ స్టేజి షూటింగ్ లో ఉంది .

ప్రస్తుతం వాయిదా పడింది కాబట్టి ముందు అనుకున్నట్టుగా సమ్మర్ రిలీజ్ ఉండకపోవచ్చు. ఇదిలా ఉండగా దీని శాటిలైట్ డీల్ 10 కోట్లకు అమ్ముడయ్యిందన్న వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది చాలా భారీ మొత్తం. డిజిటల్ కాకుండా కేవలం ఉపగ్రహ హక్కుల ద్వారా ఇంత రావడం అనేది చాలా అరుదు. ఈ లెక్కన నిర్మాత సూర్యవంశీకి టేబుల్ ప్రాఫిట్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అర్థమవుతోంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ ఒప్పుకున్న తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రెండే. ఒకటి మిస్ ఇండియా, మరొకటి రంగ్ దే.

షెడ్యూల్ ప్రకారం ముందు మిస్ ఇండియానే రావాలి. కాని ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏదీ ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి రంగ్ దే రేస్ లో ఫస్ట్ నిలబడినా ఆశ్చర్యం లేదు. దర్శకుడు వెంకీ అట్లూరికి ఇది మూడో సినిమా. వరుణ్ తేజ్ తొలిప్రేమతో భారీ హిట్టు కొట్టినా అఖిల్ మిస్టర్ మజ్నుతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. మంచి ఎమోషన్స్ తో లవ్ స్టోరీస్ ని సెన్సిబుల్ గా తెరకెక్కిస్తాడని పేరున్న వెంకీ అట్లూరి రంగ్ దేని కూడా అదే స్టైల్ లో రూపొందించి ఉంటారన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. మొత్తానికి నితిన్ కోరుకున్న మార్కెట్ భీష్మ పుణ్యమాని మళ్ళి వచ్చేసి రంగ్ దేతో పీక్స్ కు వెళ్ళేలా ఉంది

Show comments